టీచర్ల బదిలీలకు గైడ్​లైన్స్ పై కొనసాగుతున్న కసరత్తు

టీచర్ల బదిలీలకు గైడ్​లైన్స్ పై కొనసాగుతున్న కసరత్తు
  • జిల్లాల పర్యవేక్షణకు స్టేట్ ఆఫీసర్లు  
  • బదిలీల్లో కొత్తగా పలు వాధ్యులకు పాయింట్లు  
  • ఓడీ సంఘాల జిల్లా నేతల వివరాల సేకరణ  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ల ట్రాన్స్​పర్లు, ప్రమోషన్ల ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేసింది. సీనియర్ విద్యాశాఖ అధికారులతో గైడ్​లైన్స్​ రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా టీచర్ల సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలనూ తీసుకుంటోంది. బదిలీలకు సంబంధించిన షెడ్యూల్​ను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా సర్కారు స్కూల్ టీచర్లున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో 2015లో బదిలీలతో పాటు ప్రమోషన్లు చేపట్టగా, 2018లో బదిలీలు మాత్రమే నిర్వహించారు. తొలిసారిగా 2018లో ఆన్​లైన్ విధానంలో ట్రాన్స్​ఫర్లు చేపట్టారు. ఈ ఏడాది కూడా ఆన్​లైన్​లో బదిలీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారంతా బదిలీలకు అర్హులు కావడంతో దాదాపు 70 వేల మందికి పైగా టీచర్లు ట్రాన్స్​ఫర్ల ప్రక్రియలో  పాల్గొనేందుకు చాన్స్ ఉంది. మరోపక్క ప్రమోషన్లను మాత్రం ఆఫ్​లైన్ లో నిర్వహించాలని భావిస్తుండగా, కొన్ని టీచర్ల సంఘాలు ఆన్​లైన్​లోనే చేపట్టాలని పట్టు పడుతున్నాయి. అయితే దీనికి ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ తయారు చేయించాలని, ప్రక్రియ చేపట్టేందుకు ఆలస్యమవుతుందని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. అందుకే అప్లికేషన్ల ప్రక్రియ వరకూ ఆన్​లైన్​లో కొనసాగే అవకాశముంది. ఒకటి, రెండు రోజుల్లో బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ కానుండగా, అప్లికేషన్ల ప్రక్రియ 23 లేదా 27 నుంచి మొదలుపెట్టనున్నారు.   

స్టేట్ నుంచి అబ్జర్వర్లు 

బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ 35 రోజుల పాటు కొనసాగనున్నది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు రాష్ట్రస్థాయి అధికారులను జిల్లాలకు అబ్జర్వర్లుగా నియమించాలని నిర్ణయించారు. చాలామంది డీఈఓలకు సర్వీస్ రూల్స్​పై పెద్దగా అవగాహన లేకపోవడం, స్టేట్ ఆఫీసర్ నుంచి కోఆర్డినేషన్ కు అబ్జర్వర్లు ఉపయోగపడతారని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే బదిలీల్లో కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో డయాలసిస్ ట్రీట్​మెంట్ తీసుకునే టీచర్లు, మస్క్యులర్ డిస్ట్రోఫీ, తలసేమియా, ఆటిజంతో బాధపడుతున్న పిల్లల పేరెంట్స్​కు కొంత మినహాయింపు ఇవ్వాలని లేదా పాయింట్లు ఇవ్వాలని భావిస్తున్నారు.   

‘ఓడీ’ నేతల వివరాల సేకరణ 

ప్రస్తుతం అదర్ డ్యూటీ (ఓడీ) ఉన్న టీచర్ల సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సేకరించారు. అయితే కొన్ని సంఘాలకు గుర్తింపు లేకున్నా, ఓడీ ఇచ్చిన సర్కార్.. మరోపక్క గుర్తింపు ఉన్న తపస్, టీఎస్పీటీఏ సంఘాల నేతలకు మాత్రం ఓడీ ఇవ్వలేదు.