
- మొన్నటిదాకా రూ.100కు 5 కిలోలు
- నెల రోజుల్లోనే భారీగా పెరిగిన ధర
- మహారాష్ట్ర నుంచి తగ్గిన సరఫరా
- డిమాండ్ పెరగడంతో రేట్లూ పెరుగుతున్నయ్
హైదరాబాద్, వెలుగు: ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. వారం పది రోజుల్లోనే మూడు రెట్లు పెరిగాయి. మొన్నటి దాకా కిలో రూ.20, 30 లోపు పలుకగా.. ఇప్పుడు రూ.70 పైనే ఉంటున్నాయి. పంట దిగుబడులు పడిపోవడం, మహారాష్ట్ర నుంచి సరఫరా తగ్గిపోవడంతోనే రేట్లు పెరిగినట్లు తెలుస్తున్నది. నెల రోజుల కిందట హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.1,500 నుంచి 2,000 పలికిన ఉల్లి.. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి6,500 పలుకుతున్నది. నెల రోజుల కిందటి వరకు మార్కెట్‌కు రోజుకు 400 నుంచి 500 లారీల ఉల్లి దిగుమతి కాగా, ప్రస్తుతం 150 నుంచి 200 లోపే లారీలు వస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు సరిపడా సప్లయ్ లేకపోవడం వల్ల ధరలు పెరిగాయని అంటున్నారు.
లోకల్ పంట వచ్చే దాకా తిప్పలే
రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు, మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, మహబూబ్‌నగర్‌లోని కొల్లాపూర్, అలంపూర్, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతున్నది. ఇక్కడి పంట అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తుందని మార్కెటింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే జులైలో వచ్చిన వరదలు, ఆగస్టులో వానలు లేక పంట నష్టం జరిగిందని చెప్తున్నాయి. ఈ క్రమంలో పంట మార్కెట్‌కు రావడానికి లేట్ అవుతున్నదని అంటున్నాయి. నవంబర్ ఆఖరు వారంలో కొత్త పంట చేతికొచ్చే అవకాశం ఉంటుందని, అప్పటివరకు ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
సెప్టెంబర్ నెలలో నంబర్ వన్ రకం ఉల్లి రూ.20 నుంచి రూ.30 లోపే ఉండింది. బహిరంగ మార్కెట్‌లో రూ.100కు నాలుగు నుంచి ఐదు కిలోలు అమ్మారు. నాలుగైదు రోజుల కిందటి వరకు కిలో రూ.40కి, శనివారం నుంచి రూ.70 కి ఎగబాగాయి. శనివారం హైదరాబాద్‌లోని మలక్‌పేట్ హోల్‌సేల్ మార్కెట్‌లో నంబర్ వన్ రకం కిలో గరిష్టంగా రూ.65 పలికింది. కనిష్టంగా రూ.48 పలికింది. నంబర్ 2 రకం ఉల్లి గరిష్టంగా రూ.47 దాకా పలికింది. హైదరాబాద్‌లోని రైతు బజార్లలో నంబర్ 2 రకం రూ.44 నుంచి రూ.50 దాకా, బహిరంగ మార్కెట్‌లో రూ.70 దాకా అమ్ముతున్నారు. భారీగా పెరిగిన ధరలను చూసి సామాన్యులు ఉలిక్కిపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా జరుగుతలే
రాష్ట్రానికి ప్రధానంగా మహారాష్ట్ర నుంచి 90 శాతం ఉల్లి దిగుమతి అవుతుంది. రాష్ట్రంలోని రంగారెడ్డి, చేవెళ్ల, తాండూరు, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొంత, ఏపీలోని కర్నూలు నుంచి ఉల్లి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. జులైలో వర్షాలతో అక్కడ ఉల్లి పంట చాలా వరకు దెబ్బతిన్నది. దీంతో దిగుబడి తగ్గి రాష్ట్రానికి రావాల్సిన సరుకు గణనీయంగా తగ్గింది. ఆగస్టులో నీటి ఎద్దడి ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో ఉల్లి దిగుబడి పడిపోయింది. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా కాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెటింగ్ వర్గాలు అంటున్నాయి.
హైదరాబాద్‌లోని ప్రధాన హోల్‌సేల్ మార్కెట్లయిన మహబూబ్ మాన్షన్, బేగంబజార్, బోయిన్పల్లి, సికింద్రాబాద్మోండా మార్కెట్లకు ఉల్లి దిగుమతులు 50 శాతానికి పైనే తగ్గినట్టు హోల్‌సేల్ వ్యాపారి ధరణికోట సుధాకర్ చెప్పారు. శనివారం మహారాష్ట్ర, కర్నూల్, గద్వాల నుంచి నంబర్ వన్ రకం 2,180 క్వింటాళ్లు, నంబర్ 2 రకం 3,270 క్వింటాళ్ల ఉల్లి మాత్రమే మార్కెట్‌కు వచ్చింది. వారం రోజుల క్రితం నంబర్ వన్ రకం 5,482 క్వింటాళ్లు, నంబర్ 2 రకం 8,224 క్వింటాళ్లు వచ్చింది.