హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ కాలేజీలకు దీటుగా పేద విద్యార్థులు ర్యాంకులు కొట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో చదువుతున్న ఇంటర్మీడియెట్ విద్యార్థుల కోసం ఇటీవల స్పెషల్ ఆన్ లైన్ కోచింగ్ క్లాసులను షురూ చేసింది. రాబోయే ఈఏపీసెట్– 2026 (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) ఎంట్రన్స్ టెస్టులో గురుకుల విద్యార్థులు సత్తా చాటేలా ఈ శిక్షణను అధికారులు డిజైన్ చేశారు.
గతంలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం మెరిట్ స్టూడెంట్లను మాత్రమే ఎంపిక చేసి, ఒకటి రెండు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ) సెంటర్లలో మాత్రమే ఇలాంటి కోచింగ్ ఇచ్చేవారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీవోఈల సంఖ్యను 2 నుంచి 10కి పెంచడమే కాకుండా.. రాష్ట్రంలోని మొత్తం 261 బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లోని ప్రతీ ఎంపీసీ, బైపీసీ విద్యార్థికి ఈ కోచింగ్ అందేలా చర్యలు చేపట్టింది.
