పింఛన్ వస్తలేదు బాంచన్

పింఛన్ వస్తలేదు బాంచన్

కోహెడ, వెలుగు: మా భర్తలు చనిపోయి మూడునాలుగేళ్లు అయితంది. ఇప్పటికీ పింఛన్ వస్తలేదు. ఎట్ల బతకాలే బాంచన్’.. అంటూ సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఎదుట వృద్ధులు గోడు వెళ్లబోసుకున్నారు. సోమవారం మండలంలోని వెంకటేశ్వరపల్లికి ఆమె రాగా గ్రామస్తులు సమస్యలను వివరించారు. పింఛన్లు ఇన్ని రోజులుగా ఎందుకు ఆన్​లైన్ చేయలేదని ఎంపీడీవోను అడిషనల్​కలెక్టర్​ప్రశ్నించారు. ప్రస్తుతం ఆన్​లైన్​పోర్టల్ బంద్ అయిందని ఓపెన్ కాగానే చేయిస్తానని వృద్ధులకు ఆమె హామీ ఇచ్చారు.

గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం నాగ సముద్రాల గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనం, క్రీడాప్రాంగణం, శానిటేషన్ పరిశీలించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట డీపీవో దేవకీదేవి, డీఎఫ్వో శ్రీనివాస్, జడ్పీ సీఈవో రమేశ్, ఎంపీడీవో మధుసూదన్, ఎంపీవో సురేశ్ ఉన్నారు.