బషీర్‌బాగ్, వెలుగు: లివ్-ఇన్ రిలేషన్షిప్ కోసం ఆన్లైన్లో సర్చ్ చేసి ఓ యువకుడు రూ.6.49 లక్షలు పోగొట్టుకున్నాడు. మలక్‌పేట ప్రాంతానికి చెందిన 32 ఏండ్ల యువకుడు తొలుత లివ్-ఇన్ రిలేషన్షిప్ కోసం ఆన్లైన్లో సర్చ్ చేశాడు.
స్కామర్స్పోస్టు చేసిన లింక్ పై క్లిక్‌చేసి తన వివరాలు నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ ఏడాది జులై 9న తాన్య శర్మ పేరిట బాధితుడికి వాట్సాప్ కాల్ వచ్చింది. ప్రముఖ డేటింగ్ యాప్ నుంచి కాల్ చేస్తున్నట్లు తెలిపి, రిజిస్ట్రేషన్ కోసం రూ.1,950 లను చెల్లించాలని కోరింది.
దీంతో బాధితుడు ఆ డబ్బును బదిలీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అనంతరం అతని నంబర్‌ను డేటింగ్ గ్రూప్ లో జాయిన్ చేశారు. తర్వాత మిస్ ప్రీతి, మిస్ రితిక పేర్లతో స్కామర్లు బాధితుడిని సంప్రదించారు. లివ్-ఇన్ రిలేషన్షిప్ కోసం హోటల్ బుకింగ్, మీటింగ్ కన్ఫర్మేషన్, సర్వీస్ టాక్స్, అకౌంట్ వెరిఫికేషన్, ప్రైవసీసెక్యూరిటీ ఫీ పేరిట రిఫండబుల్ ప్రాసెస్ అని నమ్మిస్తూ చెల్లింపులు చేయాలని ఒప్పించారు.
వారి మాటలను నమ్మిన యువకుడు.. వివిధ అకౌంట్ లకు మొత్తం రూ. 6,49,840 లను బదిలీ చేశాడు. స్కామర్స్ ఇంకా డబ్బులను చెల్లించాలని ఒత్తిడి చేయడంతో మోసపోయానని గ్రహించి, గురువారంహైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు.
