బీమాపై ఆసక్తి చూపుతున్నది 13 శాతం మందే!

బీమాపై ఆసక్తి చూపుతున్నది 13 శాతం మందే!

ఫిక్స్​డ్​ డిపాజిట్లకూ ఆదరణ తక్కువే.. వెల్లడించిన తాజా సర్వే
న్యూఢిల్లీ:మనదేశంలో బీమాకు, పొదుపునకు జనం పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. యాక్సిస్ మై ఇండియా కన్స్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ (సీఎస్​ఐ)  పేరుతో చేసిన సర్వే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియజేసింది. దీని ప్రకారం.. 13శాతం మంది భారతీయులు మాత్రమే ఆరోగ్య బీమా లేదా జీవిత బీమాలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో మెజారిటీ రెస్పాండెంట్లు బీమాపై ఆసక్తి చూపలేదు. కేవలం నాలుగు శాతం మంది ఫిక్స్‌‌డ్ డిపాజిట్లు,  రికరింగ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు.  మూడు శాతం మంది షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌‌లో పెట్టుబడులను పరిశీలిస్తుండగా, రెండు శాతం మంది బంగారంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం పెట్టుబడుల గురించే ఆలోచించడం లేదని దాదాపు 78శాతం మంది చెప్పారు. మెరుగైన అవకాశాల కోసం మరొక దేశానికి వలస వెళ్లడంపై, ఇన్వెస్ట్​మెంట్ల గురించి  వారి అభిప్రాయాలపైనా ఈ సర్వే ఫోకస్​ చేసింది. రష్యా–-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తాజా సమాచారాన్ని 50 శాతం కంటే తక్కువ మందే కోరుకుంటున్నారు.   ఇంటి ఖర్చులు, అవసరమైన,  అనవసరమైన వస్తువులపై ఖర్చు, ఆరోగ్య సంరక్షణపై ఖర్చు, మీడియా వినియోగ అలవాట్లు, రవాణా పద్ధతులపైనా ఈ సర్వే ఫోకస్​ చేసింది.  టెలివిజన్  వార్తాపత్రికలలో ప్రకటనల క్లెయిమ్స్​, ఐపీఎల్​ సమయంలో విపరీతంగా పాపులర్​ అయిన బ్రాండ్లు, ఇంపార్టెంట్​ న్యూస్ ​కంటెంట్,  రష్యా–-ఉక్రెయిన్ యుద్ధ సంబంధిత వార్తలపై ఆసక్తి గురించి జనం అభిప్రాయాలను మరింత లోతుగా పరిశోధించింది. క్విక్​ గ్రాటిఫికేషన్​ స్కీములు (త్వరిత ప్రయోజన పథకాలు), నూతన సంవత్సర పెట్టుబడులపై ప్లాన్ల గురించి రెస్పాండెంట్ల ఆలోచనలను కూడా సర్వే తెలుసుకుంది. సర్వే కోసం అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో 10,166 మంది  అభిప్రాయాలను తీసుకున్నారు.   
సర్వేలోని ముఖ్యమైన విషయాలు
1.దాదాపు 66 శాతం కుటుంబాలకు ఇంటి ఖర్చులు పెరిగాయి. పోయిన నెల కంటే ఇవి 4శాతం పెరిగాయి.   పర్సనల్​ కేర్​ & గృహోపకరణాల వంటి నిత్యావసరాలపై ఖర్చు పెరిగిందని 48శాతం కుటుంబాలు తెలిపాయి.  అయితే 33శాతం కుటుంబాలు మాత్రం తమ ఖర్చుల్లో మార్పు లేదని అన్నాయి.  
2.ఏసీ, కారు, రిఫ్రిజిరేటర్ వంటి వాటిపై ఖర్చులు 14శాతం కుటుంబాలకు పెరిగాయి.  అయితే 80శాతం కుటుంబాలకు ఖర్చుల్లో మార్పులు లేవు.
3.దాదాపు 38శాతం కుటుంబాల్లో ఆరోగ్యానికి సంబంధిత వస్తువుల వాడకం పెరిగింది. 47శాతం కుటుంబాల్లో వీటి వాడకం ఎప్పట్లాగే ఉంది. అయితే 15శాతం మందిలో వాడకం తగ్గింది.  
 4. మీడియా చూడటం పెరిగిందని 23శాతం కుటుంబాలు తెలిపాయి. పోయిన నెలతో పోలిస్తే ఇది ఒకశాతం పెరిగింది. మెజారిటీ (52శాతం) కుటుంబాల విషయంలో ఇది ఎప్పట్లాగే ఉంది.   
5. టూర్లు, మాల్స్​,  రెస్టారెంట్‌‌ల కోసం ఎప్పట్లాగే వెళ్తున్నామని 85శాతం కుటుంబాలు తెలిపాయి. తమ ప్రయాణాలు పెరిగాయని 8శాతం కుటుంబాలు మాత్రమే చెప్పాయి.  
6. ఐపీఎల్​ సీజన్​లో  9శాతం మంది - ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌‌ఫారమ్ డ్రీమ్ 11​ యాడ్స్​ను గమనించారు. మరో ఆరు శాతం మంది టాటా న్యూ  ప్రకటనలను చూశారు.  మొత్తం మీద   22శాతం మంది ఐపీఎల్​ని చూశారు.   
8. పోయిన ఏడాదిలో 35శాతం మంది ఆన్‌‌లైన్ షాపింగ్‌‌లో మునిగిపోయారు. అదనంగా,  యాప్‌‌ల ద్వారా 19శాతం మంది క్విక్​ గ్రాటిఫికేషన్​ స్కీమ్​ను చూశారని (జొమాటో వంటి క్విక్​ డెలివరీలు ) సర్వే తెలిపింది.
9. మంచి అవకాశాలు,  జీవనశైలి కోసం ఇతర దేశానికి వలస వెళ్లేందుకు ఇష్టపడతామని 33శాతం మంది చెప్పారు. ఇండియాలోనే ఉండటం ఇష్టమని 64శాతం మంది చెప్పారు.