భద్రాచలంలో 300 మందికే అన్నప్రసాదం టోకెన్లు

భద్రాచలంలో 300 మందికే అన్నప్రసాదం టోకెన్లు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తుల్లో కొందరికే అన్నప్రసాదం అందుతోంది. అన్ని ప్రధాన ఆలయాల్లో రౌండ్  ది క్లాక్​ అన్నదానం చేస్తుండగా, ఇక్కడి ఆఫీసర్లు మాత్రం భక్తులకు అన్నదానం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రతీరోజు 5 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటుండగా, వీరిలో 300 మందికే అన్నప్రసాదం టిక్కెట్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో మిగిలిన భక్తులకు అన్నప్రసాదం దక్కడం లేదు. దేవస్థానంలో అన్నదానం చేసేందుకు భక్తులు రూ.32కోట్ల విరాళాలు అందించారు. వీటిని బ్యాంకుల్లో ఫిక్స్ డ్​ డిపాజిట్(ఎఫ్డీ) చేసి వాటిపై వచ్చే వడ్డీ డబ్బులను అన్నదానం కోసం ఖర్చు చేస్తుంటారు. ఎఫ్డీల ద్వారా నెలకు రూ.15లక్షల వడ్డీ వస్తుండగా, వీటిని అన్నదానానికి మాత్రమే ఖర్చు చేయాలి. ఇందులో నెలకు రూ.7 నుంచి రూ.8లక్షల వరకే వినియోగిస్తుండగా, మిగిలిన డబ్బులు బ్యాంకుల్లోనే మూలుగుతున్నాయి. 

300 మందికే టోకెన్లు
ప్రతీ రోజు దేవాలయానికి వచ్చే భక్తుల్లో 300 మందికి మాత్రమే అన్నదానం టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి టోకెన్లు ఇస్తుండగా, అవి అయిపోయాక వచ్చే భక్తులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. హనుమాన్​ జయంతి రోజున 2వేల మందికి, నవమి, ముక్కోటి ఏకాదశి పర్వదినాల్లో 20 వేల మందికి అన్నదానం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ప్రతీరోజు 5 వేల మంది భక్తులు రామయ్య దర్శనానికి వస్తుండగా, కేవలం 300 మందికే టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఈ టోకెన్లు అర గంటలో కంప్లీట్​ అయిపోతున్నాయి. బ్యాంకులో కావాల్సినన్ని డబ్బులు ఉన్నా దేవస్థానం వాటిని ఖర్చు చేయకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సంఖ్యను అంచనా వేయలేక పోతున్నామని, తగినంత మంది భక్తులు రాకపోతే భోజనం మిగిలిపోతుందని దేవస్థానం ఆఫీసర్లు అంటున్నారు. అయితే ప్రధాన దేవాలయాల్లో టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. బయోమెట్రిక్​ విధానాన్ని అమలు చేసి భక్తులకు సకాలంలో అన్నప్రసాదం అందిస్తున్నారు. ఈ దిశగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.  భక్తులు ఇచ్చిన విరాళాలకు తగిన న్యాయం చేయాలంటే నిత్యాన్నదాన పథకంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

అభ్యంతరాలను పట్టించుకుంటలేరు..
అన్నదానం ఎఫ్డీలపై వచ్చే వడ్డీ డబ్బులు ఖర్చు చేసే విషయంపై అభ్యంతరాలు వస్తున్నా దేవస్థానం ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ప్రతీనెలా ఆడిట్​ జరుగుతున్నా ఎఫ్డీలపై వచ్చే వడ్డీ సొమ్ము, ఖర్చు, మిగులు చూసి ప్లాన్​ చేయాలని సూచిస్తుంటారు. ఏటా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలోనూ సూచనలు చేస్తున్నారు. అయితే వీటిని ఆఫీసర్లు పట్టించుకోకుండా ఖర్చు చేస్తున్నామని మొక్కుబడి సమాధానం చెబుతున్నారు. 

సంస్కరణలు తెస్తాం
నిత్యాన్నదాన పథకం అమలులో సంస్కరణలు తెస్తాం. ఎక్కువగా వండితే పడేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో పరిమితి పెట్టాం. 500 వరకు టోకెన్లు ఇస్తున్నాం. కొన్నిసార్లు భక్తులకు అన్నప్రసాదం అందడం లేదనేది వాస్తవమే. అందరికీ అన్నప్రసాదం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఎఫ్డీలపై వచ్చే వడ్డీ డబ్బులు మిగులుతున్నాయి. ఈ విషయంపై అభ్యంతరాలకు పరిష్కారం చూపిస్తాం. –శివాజీ, ఈవో, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం