కేసీఆర్ సభకు లక్ష మంది అనుకుంటే 40 వేలే వచ్చిన్రు

కేసీఆర్ సభకు లక్ష మంది అనుకుంటే 40 వేలే వచ్చిన్రు
  • హైదరాబాద్, భువనగిరి, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల నుంచి తరలింపు
  • అయినా గ్రౌండ్ పూర్తిగా నిండలే
  • సభలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన
  • లెంకలపల్లికి వెళ్లకుండానే తిరుగుపయనమైన సీఎం

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: చండూరు బంగారిగడ్డలో టీఆర్ఎస్ నిర్వహించిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సభకు బయటి నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు భారీ జన సమీకరణ చేయాలని టీఆర్ఎస్ పెద్దలు భావించారు. అయితే నియోజకవర్గవ్యాప్తంగా తరలించినా గ్రౌండ్ నిండే పరిస్థితి కనిపించలేదు. దీంతో హైదరాబాద్ సిటీతోపాటు, ఇబ్రహీంపట్నం, భువనగిరి, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరించారు. సభకు వచ్చిన వాహనాల్లో సుమారు 150 వాహనాలు బయటి ప్రాంతాల నుంచే వచ్చినట్లు తెలిసింది. ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్‌‌కు చెందిన పలు ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ల బస్సులు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి తరలిరావడంతో చండూరుకు వెళ్లే రోడ్డులో వాహనాలు ఆపి భోజనాలు చేయడం కనిపించింది. సభకు సుమారు లక్ష మందిని తరలించాలని టార్గెట్ గా పెట్టుకుంటే.. వచ్చినవాళ్ల సంఖ్య 40 వేలకు మించలేదు. సభ ప్రాంగణం కొద్ది దూరం దాకా ఖాళీగా కనిపించింది.
నిరాశకు గురైన లెంకలపల్లి గ్రామస్తులు
మర్రిగూడెం మండలంలోని లెంకలపల్లిలో టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను సీఎం కేసీఆర్ తీసుకున్నారు. దీంతో తమ ఊరికి సీఎం ఎప్పుడొస్తారా అని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం చండూర్ బహిరంగ సభకు హాజరవుతున్న ఆయన లెంకలపల్లికి కూడా వస్తారని అంతా భావించారు. రోడ్డు మార్గంలో వస్తే తమ ఊరి మీదుగా వెళ్తారని అనుకున్నారు. కానీ ఆయన హెలికాప్టర్‌‌‌‌లో నేరుగా సభకు హాజరై.. తిరిగి అదే హెలికాప్టర్‌‌‌‌లో వెళ్లిపోవడంతో గ్రామస్తులు నిరాశకు గురయ్యారు.