పోలింగ్​కు ఇంక నెల రోజులే ..ప్రచారానికి గడువు 28 రోజులే

పోలింగ్​కు ఇంక నెల రోజులే ..ప్రచారానికి గడువు 28 రోజులే
  • రెండు నెలలకు పైగా ఫీల్డ్​లో బీఆర్ఎస్​
  • అభ్యర్థులు ప్రకటన, పొత్తుల దగ్గర్నే కాంగ్రెస్, బీజేపీ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​కు సరిగ్గా నెల రోజుల గడువు మాత్రమే ఉంది. ఎన్నికల ప్రచారానికి ఇంకో 28 రోజుల వ్యవధి ఉంది. రెండు నెలలకుపైగా బీఆర్ఎస్​ ఫీల్డ్​లోనే ఉండగా.. అభ్యర్థుల ఎంపిక, పొత్తుల ఖరారు దగ్గరే కాంగ్రెస్, బీజేపీ ఆగిపోయాయి. ఎన్నికల ప్రచారంలోనూ గులాబీ పార్టీ ముందున్నది. పార్టీ చీఫ్​ కేసీఆర్ రాష్ట్రం మొత్తాన్ని చుట్టేస్తుండగా.. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు నిత్యం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూనే ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను బీఆర్ఎస్​లోకి తీసుకురావడంపై ఫోకస్​ చేశారు. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చి ప్రచార సభల్లో పాల్గొంటున్నా ఫీల్డ్​లో మాత్రం అభ్యర్థులు పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. కేసీఆర్​ఆగస్టు 21న 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వారంతా అప్పటి నుంచే ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్​పార్టీ చర్చోపచర్చల తర్వాత రెండు విడతల్లో వంద స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేసింది. ఇంకో 19 స్థానాల్లో తాము పోటీ చేయాలా.. కమ్యూనిస్టులకు కొన్ని సీట్లు ఇవ్వాలా అనేదానిపై ఇప్పటివరకు క్లారిటీకి రాలేదు. బీజేపీ 53 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లలో పోటీ చేసే క్యాండిడేట్ల లిస్ట్​ఎప్పుడు వస్తుందనే దానిపై ఆ పార్టీ రాష్ట్ర నేతలకు స్పష్టత లేదు. ఇంకోవైపు జనసేనతో పొత్తు, సీట్ల ఖరారుపై బీజేపీలో చర్చలు కొలిక్కి రాలేదు. ఇంకో నాలుగు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ అవుతున్నా కాంగ్రెస్​, బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేయలేదు.

నోటిఫికేషన్​ రోజుకైనా పూర్తి లిస్టులు వచ్చేనా?

రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్​30న ఎన్నికల పోలింగ్​నిర్వహించనున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ​ప్రకటించగా.. నవంబర్​3న ఎన్నికల నోటిఫికేషన్ ​రానుంది. పదో తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. గజ్వేల్, కామారెడ్డి సీట్లలో పోటీ చేస్తున్న కేసీఆర్..  నవంబర్​9న రెండు చోట్ల నామినేషన్​దాఖలు చేస్తానని దాదాపు 15 రోజుల కింద ప్రకటించారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు నవంబర్​13న స్క్రూటినీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ వరకు గడువు ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సరిగ్గా 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎన్నికల నోటిఫికేషన్​వచ్చే రోజుకైనా రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్​, బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తాయా లేదా అనే డైలమా కొనసాగుతున్నది. కర్నాటక ఎన్నికల్లో గెలిచి జోష్​ మీదున్న కాంగ్రెస్​పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్లగలిగామని ధీమాగా ఉంది. కానీ, ఇంకా ఆ పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారంలోకి మాత్రం దిగలేదు. జీహెచ్ఎంసీతో పాటు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్​ను తామే ఓడించామని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడించి గద్దె దించుతామని చెప్తున్న బీజేపీ.. మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీఆర్ఎస్​ మేనిఫెస్టో ప్రకటించగా, కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలను ప్రకటించింది.. పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉంది. బీజేపీ మేనిఫెస్టో కూడా ఇంకా రాలేదు.

ఇతర పార్టీల పరిస్థితి ఇదీ..

ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు బీఎస్పీ, ధర్మసమాజ్​పార్టీ, బహుజన​ లెఫ్ట్ ​ఫ్రంట్ ​కొన్ని స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించాయి. వైఎస్సార్​టీపీ త్వరలోనే తమ అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్తున్నది. కాంగ్రెస్​తో పొత్తు కోసం సీపీఐ, సీపీఎం ఎదురుచూస్తున్నాయి.  తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ ప్రకటించింది. జనసేన సొంతగా 31 స్థానాల్లో పోటీకి సిద్ధపడినా.. బీజేపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాలను తేల్చుకోవడంపై ఆ పార్టీ ఫోకస్​ పెట్టింది. రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​పై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆ స్థాయిలో ఫీల్డ్​వర్క్​మాత్రం చేయడం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎన్నికలకు నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ఇప్పటికైనా రెండు పార్టీలు పూర్తి స్థాయిలో ఫీల్డ్​లోకి దిగితే తప్ప ఏ పార్టీ బలం ఏమిటి.. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనే దానిపై స్పష్టత వచ్చే చాన్స్​ లేదని విశ్లేషకులు చెప్తున్నారు. నవంబర్​28న సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఈ 28 రోజులు కీలకమని అంటున్నారు.