గుర్తులు ఖరారు!.. ప్రచారానికి అభ్యర్థుల ఉరుకులు పరుగులు

గుర్తులు ఖరారు!.. ప్రచారానికి అభ్యర్థుల ఉరుకులు పరుగులు
  • మొదటి విడతకు మిగిలింది వారం రోజులే 
  • పాంప్లేట్లు, డోర్ పోస్టర్లు, డమ్మీ గుర్తులతో ప్రచారం
  • ఇంటింటి ప్రచారం, వేరే ఊర్లలో ఉంటున్న వారికి ఫోన్లు
  • కొనసాగుతున్న మూడో విడత నామినేషన్లు
  • రెండో విడత ఉప సంహరణకు రేపటి వరకు గడువు
  • ఉమ్మడి జిల్లాలో 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల విత్ డ్రా ముగిసిన తర్వాత బరిలో ఉన్న ఫైనల్​ క్యాండిడేట్ల లిస్ట్ ను అధికారులు ప్రకటించారు. వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో ప్రచార సామగ్రిని తెచ్చుకోవడంలో అభ్యర్థులు బిజీ అయ్యారు. ఇంటింటి ప్రచారానికి అవసరమయ్యే డోర్ పోస్టర్లు, పాంప్లేట్లు, డమ్మీ గుర్తులను సమకూర్చుకుంటున్నారు. ఈనెల 11న పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు. గుర్తులను కేటాయించిన తర్వాత పోలింగ్ కు మధ్యలో వారం రోజులు మాత్రమే ఉండడంతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిపెట్టారు. 

తమ పార్టీకి చెందిన వార్డు మెంబర్లతో కలిసి సర్పంచ్​ అభ్యర్థి ప్రచారం మొదలుపెడుతున్నారు. ఓటర్ల లిస్ట్ ఆధారంగా గ్రామంలో ఉన్న వారిని ప్రత్యక్షంగా కలవడంతో పాటు ఇతర ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉన్న ఓటర్లకు ఫోన్​ చేసి, తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పోలింగ్ రోజు తప్పకుండా రావాలని, ఓటింగ్ కు ముందు మళ్లీ ఫోన్​ చేస్తామంటూ టచ్​ లో ఉంటున్నారు. మరోవైపు రెండో విడతకు నామినేషన్ల ఉప సంహరణ గడువు రేపు సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఏకగ్రీవాల కోసం పోటీలో ఉన్న వారితో చర్చలు, బేరసారాలు కంటిన్యూ అవుతున్నాయి.

ఖమ్మం జిల్లాలో 20 జీపీలు ఏక్రగీవం..

ఖమ్మం జిల్లాలో మొదటి విడతలో ఏడు మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో కొణిజర్ల, వైరా మండలాలు వైరా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉండగా, రఘునాథపాలెం మండలం ఖమ్మం అసెంబ్లీ, బోనకల్​, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాలు మధిర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. మొత్తం 192 గ్రామాలకు గాను 20 ఏకగ్రీవం కాగా, మరో 172 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో 17 గ్రామాల్లో సర్పంచ్​ తో పాటు వార్డులన్నీ ఏకగ్రీవం కాగా, మిగిలిన మూడు గ్రామాల్లో సర్పంచ్​, కొన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి.172 గ్రామాల్లో 476 మంది సర్పంచ్​ కుర్చీల కోసం పోటీపడుతున్నారు. ఇక ఈ గ్రామాల్లో 1,740 వార్డులకు 2 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 323 వార్డులు ఏకగ్రీవం కాగా, 1,415 వార్డుల కోసం 3,275 మంది పోటీలో ఉన్నారు.

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 14  జీపీలు ఏకగ్రీవం.. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో  తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే 8 మండలాల్లో ప్రచారం హోరెత్తుతోంది. 159 సర్పంచ్​లు, 1,463 వార్డు మెంబర్లకు పోటీ జరుగుతోంది.  కాగా, 242 వార్డులు, 14 గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవాలు జరిగాయి. దుమ్ముగూడెం మండలంలో దుమ్ముగూడెం, కోయనర్సాపురం, దబ్బనూతల కొత్తూరు, గంగోలు, పెద్దకమలాపురం, బూర్గంపాడులో లక్ష్మీపురం, మోరంపల్లిబంజర, పినపాకపట్టీనగర్​, కృష్ణసాగర్​, నకిరిపేట, పినపాక మండలంలో కిష్టాపురం, జగ్గారం, పాతరెడ్డిపాలెం, అశ్వాపురం మండలంలో సండ్రాలబోడు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అశ్వాపురం మండలంలో 20, బూర్గంపాడులో 57, దుమ్ముగూడెంలో 142, కరకగూడెంలో 12, మణుగూరులో 8, పినపాకలో 3 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 

ఖమ్మం జిల్లాలో ఏకగ్రీవమైన గ్రామాలు.. 

గ్రామం    మండలం    ఏకగ్రీవ సర్పంచ్​

1)గోవిందాపురం    వైరా    రంగిశెట్టి కళావతి

2)లక్ష్మీపురం    వైరా    నూతి వెంకటేశ్వరరావు

3)నారపునేనిపల్లి    వైరా    చంద్రశేఖర్​ రెడ్డి

4)పుణ్యపురం    వైరా    యంగల మరియమ్మ

5)మంగ్యాతండా    రఘునాథపాలెం    మాలోత్ భార్గవి 

6)మల్లేపల్లి    రఘునాథపాలెం    తేజావత్ బద్రి

7)రాములుతండా    రఘునాథపాలెం    బానోత్ వెంకట్రామ్​ 

8)రేగులచెలక    రఘునాథపాలెం    యండపల్లి రమాదేవి

9)రఘునాథపాలెం    రఘునాథపాలెం    ఋగాజుల కృష్ణారావు

10)రేపల్లెవాడ    చింతకాని    మడిపల్లి అంబిక

11)రాఘవాపురం    చింతకాని    కాంపెల్లి కోటమ్మ

12)కలకోట    బోనకల్    పైడిపల్లి అనిత 

13)చొప్పకట్లపాలెం    ఎర్రుపాలెం    బొగ్గుల శ్రీనివాస్​ రెడ్డి

14)గోసవీడు    ఎర్రుపాలెం    వేమిరెడ్డి పరమేశ్వరి

15)గాట్ల గౌరారం    ఎర్రుపాలెం    బండ్ల రాణి 

16)జమలాపురం    ఎర్రుపాలెం    తాళ్లూరి నిర్మలకుమారి

17)కాంచవరం    ఎర్రుపాలెం    షేక్​ ఫాతిమా బీ

18)కండ్రిక    ఎర్రుపాలెం    భూక్యా రాము 

19)సిద్దినేనిగూడెం    మధిర    వేల్పుల వెంకట్రావమ్మ

20)సైదెల్లిపురం    మధిర    నెల్లూరు ధనలక్ష్మి