ప్రస్తుత పద్ధతులు, నియమాలు బ్రిటిష్​ కాలం నాటివే

ప్రస్తుత పద్ధతులు, నియమాలు బ్రిటిష్​ కాలం నాటివే
  • సమాజానికి తగ్గట్టు న్యాయవ్యవస్థ మారాలి
  • వీడ్కోలు సమావేశంలో సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ
  • ప్రస్తుత పద్ధతులు, నియమాలు బ్రిటిష్​ కాలం నాటివే
  • అవి దేశ ప్రజల అవసరాలకు ఇప్పుడు సరిపోవు
  • కొన్ని విషయాల్లో న్యాయవ్యవస్థకు ప్రభుత్వ సహకారం అవసరం
  • అయితే అది ప్రభావం చూపేలా ఉండకూడదని కామెంట్
  • తొలిసారిగా లైవ్​లో సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్
  • ఉచితాల కేసు ముగ్గురు సభ్యుల బెంచ్​కు బదిలీ
  • ఇయ్యాల కొత్త సీజేఐగా జస్టిస్​ యూయూ లలిత్​ ప్రమాణం

న్యూఢిల్లీ:  ప్రస్తుతం న్యాయ వ్యవస్థ, పద్ధతులు, నియమాలు బ్రిటిష్​ కాలం నాటివే ఉన్నాయని, దేశ జనాభా అవసరాలకు అవి ఇప్పుడు సరిపోవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్​ ఎన్వీ రమణ అన్నారు. “మన సమాజానికి తగ్గట్టుగా న్యాయ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. న్యాయాన్ని అందించడానికి టెక్నాలజీని ఒక సాధనంగా వాడుకోవాలి” అని సూచించారు. 48వ సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. 16 నెలల కాలంలో తాను తీసుకున్న నిర్ణయాలను, చర్యలను జస్టిస్​ ఎన్వీ రమణ గుర్తు చేసుకున్నారు. 

తనకు సహకరించిన సహచర న్యాయమూర్తులకు, సుప్రీంకోర్టు అధికారులకు జస్టిస్​ ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. ప్రజల అంచనాలను అందుకోలేదుమన న్యాయవ్యవస్థ గురించి ఒక ఆర్డర్​ లేదా నిర్ణయం ద్వారా చెప్పలేమని, ఇది చాలా సార్లు ప్రజల పక్షాన నిలిచిందని ఎన్వీ రమణ అన్నారు. అయితే కొన్ని సమయాల్లో ప్రజల అంచనాలను అందుకోవడంలో న్యాయ వ్యవస్థ విఫలమవుతోందని చెప్పారు. న్యాయవ్యవస్థను బలోపేతం చేయడానికి న్యాయమూర్తుల నియామకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చానని, తాను న్యాయాధిపతిగా ఉన్న సమయంలో 11 మంది సుప్రీంకోర్టు జడ్జీలుగా, 224 మంది హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారని చెప్పారు. అలాగే మహిళలకు, అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు కల్పించే  ప్రయత్నం చేశామన్నారు. ‘‘కొలిజియం జడ్జీలు, కన్సల్టింగ్ జడ్జీలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ 16 నెలల కాలంలో మేం 11 మంది సుప్రీంకోర్టు జడ్జీలను నియమించామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. హైకోర్టు జడ్జీలుగా 255 మందిని రికమండ్​ చేశాం. వీరిలో 224 మంది ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు”అని చెప్పారు. 

గొప్ప జడ్జీని కాదు

న్యాయ వ్యవస్థలో తన ప్రయాణంపై ఎన్వీ రమణ సంతృప్తి వ్యక్తం చేశారు. కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం మొదలైందని, వృత్తి పరంగా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పారు. తాను ఎప్పుడూ గొప్ప జడ్జీని అని చెప్పుకోలేదని, అయితే సామాన్యులకు న్యాయం చేయడమే అంతిమ లక్ష్యమని తాను నమ్మానని చెప్పారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా తన పనిని ఎంతో ఆస్వాదించానన్నారు. సుప్రీంకోర్టు బెంచ్​లో చేరినప్పటి నుంచి తనపై, తన కుటుంబంపై కుట్రపూరితమైన స్క్రూటినీ జరిగిందని, దానిపై తాను, తన కుటుంబం నిశ్శబ్దంగా బాధపడ్డామన్నారు. కానీ అంతిమంగా సత్యమే గెలుస్తుందని, ‘సత్యమేవ జయతే’ అని అన్నారు. ప్రభుత్వంపై ఆధారపడక తప్పదు

న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను విడిగా చూడలేమని ఎన్వీ రమణ అన్నారు. కేసుల తీర్పు విషయానికి వస్తే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉంటుందని, కానీ ఆర్థిక లేదా నియామకాలకు సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వంపై ఆధారపడి ఉందని చెప్పారు. ప్రభుత్వం నుంచి సమన్వయం, సహకారం పొందడం అనివార్యమన్నారు.

పెండింగ్ కేసులే అతిపెద్ద సమస్య

ప్రస్తుతం న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పెండింగ్​ కేసులేనని ఎన్వీ రమణ అన్నారు. సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్, పోస్టింగ్​ వంటి అంశాలపై పెద్దగా శ్రద్ధ చూపలేకపోయినందుకు విచారం వ్యక్తంచేశారు. పెండింగ్ కేసుల ను పరిష్కరించేందుకు కొత్త టెక్నాలజీని వాడుకోవాలని అన్నారు. తాము కొన్ని చర్యలు తీసుకున్నా, సెక్యూరిటీ పరమైన సమస్యల కారణంగా పెద్దగా ప్రగతి సాధించలేకపోయామని చెప్పారు. శుక్రవారం వీడ్కోలు బెంచ్​కు ఎన్వీ రమణ నేతృత్వం వహించారు. సీజేఐగా ఆయన సాధించిన ఘనతలు మరిచిపోలేనివని అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ కొనియాడారు. ఆయన తీసుకున్న చర్యల వల్లే సుప్రీంకోర్టు ఫుల్​ స్ట్రెంగ్త్​ 34 మంది జడ్జీలతో పని చేస్తోందన్నారు. ఎన్వీ రమణకు వీడ్కోలు చెబుతూ సీనియర్​ లాయర్, ఎస్సీబీఏ మాజీ ప్రెసిడెంట్ దుష్యంత్ దవే కంటతడి పెట్టుకున్నారు. ఎన్వీ రమణ ప్రజల జడ్జి అని, జ్యుడీషియరీ, ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్​ మధ్య సమన్వయం సాధించడంలో సమర్థవంతంగా పనిచేశారని చెప్పారు.

ఇయ్యాల జస్టిస్​ యూయూ లలిత్ ప్రమాణం

సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్​ లలిత్​ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త సీజేఐగా జస్టిస్​ యూయూ లలిత్​ పేరును ఎన్వీ రమణ ప్రతిపాదించారు. బార్​ కౌన్సిల్​ సిఫార్సు ద్వారా సీజేఐగా పదోన్నతి పొందిన వారిలో జస్టిస్ యూయూ లలిత్ రెండో వారు. 65 ఏండ్లు నిండుతుండటంతో నవంబర్​ 8న పదవీ విరమణ చేస్తారు. జస్టిస్‌ యూయూ లలిత్‌ 1957, నవంబర్‌ 9న జన్మించారు. 1983లో కెరీర్‌ను ప్రారంభించారు. 2014, ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా 3పనులపై గట్టిగా ఫోకస్ పెడతానని జస్టిస్ యూయూ లలిత్ చెప్పారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన జస్టిస్​ రమణ వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ లలిత్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో ఏడాదంతా కాన్ స్టిట్యూషన్ బెంచ్ కొనసాగేలా చూస్తానని తెలిపారు.

ప్రస్తుతం న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పెండింగ్​ కేసులు. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ను, టెక్నాలజీ టూల్స్​ను వాడుకుంటే పరిష్కారం లభించవచ్చు. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను విడిగా చూడలేం. తీర్పుల విషయంలో న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉంటున్నా.. ఆర్థిక లేదా నియామకాలకు సంబంధించి  ఇప్పటికీ ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. ప్రభుత్వం నుంచి సమన్వయం, సహకారం పొందడం అనివార్యం. అయితే ఇది ప్రభావం చూపేలా ఉండకూడదు. కొన్ని సమయాల్లో ప్రజల అంచనాలను అందుకోవడంలో న్యాయ వ్యవస్థ విఫలమవుతున్నది. 

‑ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ