BCCI vs IPL: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పంజాబ్ కింగ్స్ పేసర్ గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే లాంటి యువ ఆటగాళ్లకు తొలిసారి పిలుపు లభించినప్పటికీ.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దేశవాళీ స్టార్ ప్లేయర్‌ను విస్మరించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం, ఆకిబ్ నబీ (Auqib Nabi)ని టెస్ట్ జట్టులోకి తీసుకోకపోవడంపై క్రికెట్ అభిమానులు సెలక్టర్ల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
రెండేళ్లలో 104 వికెట్లు తీసిన నబీ:
గడిచిన రెండు రంజీ సీజన్లలో జమ్మూ కాశ్మీర్ జట్టు సాధించిన విజయాల్లో ఆకిబ్ నబీ అత్యంత కీలక పాత్ర పోషించాడు. దేశవాళీ క్రికెట్‌లో అతని ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 44 వికెట్లు పడగొట్టి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక ఒకే రంజీ ట్రోఫీ సీజన్లో 60 వికెట్లు తీసిన మూడో ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
►ALSO READ | చెపాక్‌లో 'విజిల్ పోడు' ట్రోల్స్.. సీఎస్‌కే ఫ్యాన్స్‌ను ఆటపట్టించిన అభిషేక్ శర్మ తల్లి
ఆల్‌రౌండ్ ప్రదర్శన:
గత రెండు రంజీ సీజన్లలో కలిపి మొత్తం 104 వికెట్లు తీయడమే కాదు, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌తోనూ రాణించి జట్టుకు ఎన్నో విజయాలని అందించాడు. ఇంతటి అద్భుతమైన రికార్డు ఉన్న ప్లేయర్ ఖచ్చితంగా భారత టెస్టు జట్టుకు అర్హుడు అని క్రికెట్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
ఐపీఎల్ లో వైఫల్యమే శాపమైందా?:
రంజీ ట్రోఫీలో ఆకిబ్ నబీ చేసిన పరుగుల విధ్వంసం, వికెట్ల వేట చూసి ఐపీఎల్ 2026 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఫ్రాంచైజీ ఏకంగా రూ. 8.40 కోట్ల భారీ ధరకు అతనిని కొనుగోలు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 (SMAT) టోర్నీలోనూ అతను బాగానే రాణించాడు. కానీ, ఐపీఎల్ వంటి హై-లెవెల్ టోర్నమెంట్‌లో మాత్రం నబీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ తరఫున 4 మ్యాచ్‌లు ఆడినప్పటికీ, ఒక్క వికెట్ కూడా తీయలేదు.. ఐపీఎల్‌లో వైఫల్యం చెందడంతో సెలక్టర్లు టెస్ట్ ఫార్మాట్‌కు కూడా అతని పేరును పక్కనబెట్టారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
