ఒకే ఒక్క టమాటా.. 17 రూపాయలు.. అవాక్కయ్యారా...

ఒకే ఒక్క టమాటా.. 17 రూపాయలు.. అవాక్కయ్యారా...

మార్కెట్ లో టమాటా ధరలు పీఎస్ఎల్వీ రాకెట్లా  పైపైకి దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో టమాటాలను చూస్తేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇక సామాన్య ప్రజల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా దేశంలో టమాటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలలో టొమాటో ధరలు రూ.150 నుంచి రూ.200 మధ్య పలుకుతున్నాయి.

ఈ నేపథ్యంలో బెంగళూరులో ఓ కూరగాయాల మార్కెట్లో ఒక్క టమాటకు రూ.17కు సంబంధించిన బిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బెంగళూరులో కిలో టమాట ధర రూ.250 పైనే ఉంది. దీంతో స్థానికంగా ఎవరీ డే ఫ్రెష్ మార్కెట్లో  టమాటా కొనుగోలు చేసేందుకు వెళ్లిన కస్టమర్ ధరలు మండి పోతుండటంతో ఒక్క టమాటా కొనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో  షాపు యజమాని ఒక్క టామాట ధరను లెక్కించి రూ.17 లుగా బిల్ వేశాడు. ఈ బిల్ కు సంబంధించిన ఫొటోను వినియోగదారుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.  

తాజాగా టమాటా ధర కోడి మాంసం ధరలను దాటేశాయి.  భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల పంటలు దెబ్బతినడంతో దిగుబడి తగ్గిందని రైతులు అంటున్నారు. దేశవ్యాప్తంగా వర్షాలు, వరదల కారణంగా సరుకు రవాణాకు అంతరాయం కలిగిందని వ్యాపారులు చెబుతున్నారు. కొందరు వ్యాపారులు సరుకును బ్లాక్‌ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. 

టమాటాతో ఇతర కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుంటడంతో వంటల్లో టమాటా వాడకాన్ని తగ్గించేశారు. టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి కూరగాయలు, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అయితే కోడి మాంసం ధరలు తగ్గుతున్నాయి. కొన్నిచోట్ల చికెన్ ధర కంటే టమాటా ధరలు అధికంగా ఉన్నాయి. మార్కెట్ లో కేజీ చికెన్‌ ధర రూ.200 నుంచి -రూ.220గా ఉంది. టమాటాలు కంటే చికెన్‌ కొనడమే బెటర్‌ అని సామాన్యులు భావిస్తున్నారు.

నెల రోజులుగా పెరుగుతున్న టమాటా ధరలు రానున్న రోజుల్లో కిలో రూ.300కు చేరే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. టమాటా సరఫరా తక్కువగా ఉండడంతో హోల్‌సేల్ ధరలు పెరుగుతాయని తెలిపారు. దాని ప్రభావం చిల్లర ధరల పెరుగుదల రూపంలో కనిపిస్తుందని అంటున్నారు. గత మూడు రోజులుగా భారీ వర్షాల కారణంగా టమోటాలు సాగులో  దెబ్బతిన్నందున టమోటాల రాక తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.