దొరల గడీల రాజ్యం బద్దలు కొట్టే సత్తా బహుజనులకే ఉంది

దొరల గడీల రాజ్యం బద్దలు కొట్టే సత్తా బహుజనులకే ఉంది
  • బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ ఎస్  ప్రవీణ్ కుమార్

గజ్వేల్: రాష్ట్రoలో దొరలు, గడీల రాజ్యం నడుస్తోందని వాటిని బద్దలు కొట్టే సత్తా బహుజనులకే ఉందని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ ఎస్  ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రాజ్యాదికారo దిశగా దళిత బహుజనులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారo సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రజ్ఞా గార్డెన్స్ లో  నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా ఆయన గజ్వేల్ పట్టణ శివారులోని ఆర్ అండ్ ఆర్ కాలనీ సందర్శించి వారి కష్టాలు , ఇబ్బంది , సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆధిపత్య కులాలు రాజ్యమేలుతూ దళిత బహుజనుల హక్కులు కాలరాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి , అక్రమాలతో పాలకులు ప్రజలను మోసపుచ్చుతూ దగా చేస్తున్నారని, దళిత , బహుజనులు చైతన్య వంతులై వారి చర్యలను ఎండగట్టాలని ఆయన కోరారు. 
ప్రజా వ్యతిరేక విధానాల టీఆర్ఎస్ సర్కార్ ను గద్దె దించడం కోసమే బీఎస్పీ ఉద్యమం
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టిఆర్ఎస్ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీ ఉద్యమిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణoతో మునిగిన బాధితుల కోసమే బహుజన రాజ్యం రావాలని, దాని కోసo నా తుది శ్వాస వరకు పోరాడతానని తెలిపారు. బహుజన కుటుంబాలైన ఎస్సి ఎస్టీ ల పిల్లలకు బడి లేకపోవడం దురదృష్టకరమని ఆన్నారు. డాక్టర్ అంబేద్కర్, కాన్షిరాం, బెహన్ కుమారి మాయావతి కన్న కలలు , హక్కులు  బహుజన రాజ్యంతోనే నెరవేరుతాయని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 
బహుజనులను విద్యకు దూరం చేసే కుట్రలు పన్నుతూ మోసం చేస్తున్నారు
బహుజనులను విద్యకు దూరం చేసే కుట్రలుపన్నుతూ..  కార్పొరేట్ వైద్యం , కార్పొరేట్ విద్య, పట్టు చీరలు మీకు , బతుకమ్మ చీరెలు , గొఱ్ఱెలు , బర్రెలు మాకా ఆని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. సిఎం కేసిఆర్ ప్రాతినిత్యం వహిస్తున్న గజ్వేల్ లో  దళిత , బహుజనులు దుర్భర జీవితo గడుపుతున్నారని విమర్శించారు. పేద వర్గాలకు చెందిన ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో చూద్దామని ఇక్కడికి రాగా , పరిస్థితిచూస్తే చాలా బాధగా ఉందని చెప్పారు. ఆధిపత్య కులాలకు చెందిన పాలకులకు మన గోస పట్టదని, ఎంత సేపు వాళ్ల ఆస్తులు పెంచుకుంటూ పోతారని, మనగోస వారికి పట్టదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.