మెట్రో, బ‌స్సులు స్టార్ట్ చేయండి

మెట్రో, బ‌స్సులు స్టార్ట్ చేయండి

లాక్ డౌన్ లో మ‌రో ద‌శ ముగుస్తోంది. ఈ ఆదివారంతో లాక్ డౌన్ పూర్త‌వుతున్న నేప‌థ్యంలో మే 18 నుంచి కొత్త విధివిధానాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు రాబోతున్నాయి. మంగ‌ళ‌వారం జాతినుద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని మోడీ లాక్ డౌన్ 4.O పూర్తి భిన్నంగా ఉండ‌బోతోంద‌ని ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల నుంచి సూచ‌న‌ల‌తో నివేదిక‌ల‌ను కోరారు. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లాక్ డౌన్ ఎలా ఉండాల‌న్న దానిపై ప్ర‌జ‌ల అభిప్రాయం చెప్పాల‌ని అడిగారు. స‌ల‌హాలు, సూచ‌న‌లు పంపితే వాటిపై చ‌ర్చించి.. ప్ర‌భుత్వ నివేదిక‌లో చేరుస్తామ‌ని చెప్పారు. దీంతో ప్ర‌జ‌ల నుంచి భారీ స్పంద‌న వ‌చ్చింది. దాదాపు 5 ల‌క్ష‌లకు పైగా ప్ర‌పోజ‌ల్స్ వ‌చ్చాయి. ఢిల్లీ మెట్రో స‌ర్వీసుల ప్రారంభించాల‌ని, స్కూళ్లు, కాలేజీలు క్లోజ్ చేసే ఉంచాల‌ని చాలా మంది ప్ర‌జ‌లు కోరార‌ని తెలుస్తోంది.

లాక్ డౌన్ కొత్త నిబంధ‌న‌లు ఎలా ఉండాల‌న్న దానిపై లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్, స్టేట్ డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ అథారిటీల‌తో గురువారం 4 గంట‌ల‌కు స‌మావేశ‌మ‌వుతున్నట్లు తెలిపారు సీఎం కేజ్రీవాల్. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు ల‌క్ష‌ల సూచ‌న‌లు వ‌చ్చాయని, ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన అన్ని స‌ల‌హాలపై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌బ‌తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ భేటీ త‌ర్వాత ఢిల్లీలో ఏ మేర‌కు స‌డ‌లింపులు ఇవ్వాల‌న్న దానిపై కేంద్ర ప్ర‌భుత్వానికి నివేదిక పంపుతామ‌న్నారు. ప్ర‌జ‌ల సూచ‌న‌ల్లో కొన్నింటిని మీడియాకు వివ‌రించారు సీఎం కేజ్రీవాల్. ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను అనుమ‌తించాల‌ని కోర‌డంతో పాటు మాస్క్ ధ‌రించ‌కున్నా.. సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌కున్నా క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు త‌మ సూచ‌న‌ల్లో డిమాండ్ చేశార‌ని అన్నారు.

– పాక్షికంగా ఢిల్లీ మెట్రో, బ‌స్సు సర్వీసుల‌ను ప్రారంభించాలి.

– స్కూళ్లు, కాలేజీలు మ‌రికొన్నాళ్ల‌పాటు క్లోజ్ చేసి ఉంచాలి.

– రెస్టారెంట్లు, హోటళ్లు క్లోజ్ చేయాల‌ని ప్ర‌జ‌లు కోరారు. అయితే పార్శిల్ (టేక్ అవే), హోమ్ డెలివ‌రీ స‌ర్వీసుల‌ను ప్రారంభించాల‌ని సూచించారు.

– బార్బ‌ర్ షాపులు, సెలూన్స్, స్పాల‌ను మూసేయాలి.

– సినిమా థియేట‌ర్లు, స్విమ్మింగ్ పూల్స్ ఇప్పుడే ఓపెన్ చేయొద్దు.

– అత్య‌వ‌స‌ర‌, నిత్య‌వ‌స‌ర స‌ర్వీసులు పూర్తిగా అందుబాటులో ఉండేలా చూడాలి.

– నాన్ ఎసెన్షియ‌ల్ స‌ర్వీసుల‌ను రాత్రి 7 గంట‌ల నుంచి ఉద‌యం 7 గంట‌ల‌కు క్లోజ్ చేసి క‌ర్ఫ్యూ కొన‌సాగించాల‌ని ప్ర‌జ‌లు కోరారు.

– మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్సులు తెర‌వాల‌ని ప‌లు మార్కెట్ అసోసియేష‌న్లు కోరిన‌ట్లు తెలిపారు సీఎం కేజ్రీవాల్. అయితే మార్కెట్ కాంప్లెక్సుల్లో స‌రి – బేసి ప‌ద్ధ‌తిలో స‌గం షాపుల‌ను ఒక రోజు మిగ‌తా షాపుల‌ను మ‌రో రోజు తెరిచేలా అనుమ‌తి ఇవ్వాల‌ని అడిగార‌న్నారు.