
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) వచ్చిన తర్వాత టెక్నాలజీ రంగం పూర్తిగా మారిపోతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలతో మనిషి చేయలేని పనులను ఈజీగా చేసి చూపుతున్నాయి. ఈ క్రమంలో టెక్నాలజీ కంపెనీల మధ్య పోటీ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. కొత్త కొత్త టెక్నాలజీతో ఒకరిని మించి మరొకరు అన్నట్లు కంపెనీలు పోటీ పడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ (Open AI) కి పోటీగా xAI ని తీసుకొచ్చిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్లపై శుక్రవారం (ఆగస్టు 08) చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మైక్రోసాఫ్ట్ కంపెనీ ఓపెన్ ఏఐ సాఫ్ట్ వేర్ అప్డేషన్ లో భాగంగా GPT-5 వెర్షన్ ను లాంచ్ చేసింది. మైక్రోసాఫ్ట్ అనుబంధ ప్లాట్ఫామ్స్ పై ఇది అందుబాటులోకి వస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెళ్ల ఎక్స్ లో పోస్ట్ చేశారు. మైక్రోసాఫ్ట్ 365 కాపిలాట్ (Microsoft 365 Copilot), కాపిలాట్ (Copilot), గిట్ హబ్ కాపిలాట్ (GitHub Copilot), అజూర్ ఏఐ ఫౌండ్రీ ( Azure AI Foundry) తదితర వేదికలలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ పార్టనర్ అయిన ఓపెన్ ఏఐ లో ఇప్పుడు తెచ్చిన వర్షన్ మోస్ట్ పవర్ ఫుల్ గా చెప్పారు నాదెళ్ల. రీజనింగ్, కోడింగ్, చాట్ తదితర అన్ని రకాల డేటా ఎనలిటిక్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
జీపీటీ - 5 లాంచ్ చేసినట్లుగా సత్యా నాదెళ్ల ఎక్స్ లో పోస్ట్ చేయగా.. దానికి కౌంటర్ గా మస్క్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది. మైక్రోసాఫ్ట్ ను ఓపెన్ ఏఐ మింగేస్తుందని కామెంట్ చేశాడు మస్క్.
గత 50 ఏళ్లుగా ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారని.. మస్క్ కామెంట్ కు రిప్లై ఇచ్చారు నాదెళ్ల. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుని.. కొత్తది కనిపెట్టడం.. పార్ట్ నర్ ను వెతుక్కోవడం, పోటీపడటం సహజమనే అర్థంలో మస్క్ కు రిప్లై ఇచ్చారు మైక్రోసాఫ్ట్ సీఈఓ. అజూర్ ప్లాట్ ఫామ్ పై గ్రోక్-4 (Grok 4) గురించి ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు చెప్పిన నాదెళ్ల.. గ్రోక్-5 గురించి ఎదురు చూస్తున్నట్లు రిప్లై ఇచ్చారు.