- సూడాన్ నుంచి మనోళ్ల తరలింపు షురూ
- 278 మందితో జెడ్డాకు బయలుదేరిన యుద్ధనౌక
- ‘ఆపరేషన్ కావేరీ’ కోసం జెడ్డాలో రెండు విమానాలు
న్యూఢిల్లీ: ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి మనోళ్ల తరలింపు ప్రక్రియ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరీ’ని ప్రారంభించింది. మొదటి బ్యాచ్ ను సూడాన్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించింది. ఈమేరకు విదేశాంగ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సూడాన్ లోని పోర్టు నుంచి ఐఎన్ఎస్ సుమేధ యుద్ధ నౌకలో 278 మంది సౌదీ అరేబియాలోని జెడ్డాకు బయలుదేరారు. జెడ్డా నుంచి వాళ్లను ఇండియాకు తీసుకొచ్చేందుకు రెండు విమానాలు సిద్ధంగా ఉన్నాయి” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ తెలిపారు.
సూడాన్ లోని పోర్టు నుంచి బయలుదేరుతున్న ఇండియన్ల ఫొటోలను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. కాగా, సూడాన్ లో దాదాపు 3 వేల మంది ఇండియన్లు ఉన్నారు. ఆ దేశ ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పది రోజులుగా రెండు వర్గాల మధ్య భీకరమైన పోరు జరుగుతోంది. ఇప్పటి వరకు 427 మంది చనిపోగా.. 3,700 మందికి పైగా గాయపడ్డారు.
మూడ్రోజులు కాల్పుల విరమణ..
సూడాన్‌లో ఘర్షణలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. మూడ్రోజుల పాటు కాల్పుల విరమణకు ఆర్మీ, పారామిలటరీ బలగాలు ఒప్పుకున్నాయి. విదేశీయుల తరలింపు నేపథ్యంలో 72 గంటల పాటు కాల్పులు జరపబోమని ప్రకటించాయి. ‘‘రెండ్రోజుల చర్చల నేపథ్యంలో కాల్పుల విరమణకు సూడాన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలు ఒప్పుకున్నాయి. ఈ నెల 24 అర్ధరాత్రి నుంచి మూడ్రోజుల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది” అని అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.