
చిన్నారుల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఆపరేషన్ ముస్కాన్ 11వ దశకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా జులై 1 నుంచి 31 వరకు నెల రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించనున్నారు.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 706 మంది పోలీసులతో కూడిన 121 సబ్ డివిజనల్ పోలీసు బృందాలను వినియోగిస్తున్నారు. బాల కార్మికులు, భిక్షాటన, వెట్టిచాకిరీల నుంచి చిన్నారులకు విముక్తి కల్పించి వారికి పునరావాసం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్‌ను చేపట్టింది. ఈ పథకం రాష్ట్ర మహిళా భద్రతా విభాగం నోడల్ ఏజెన్సీగా అమలులో ఉన్నది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ, కార్మికశాఖ, ఆరోగ్యశాఖ, బాలల సంక్షేమ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణా విభాగాలతోపాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఆపరేషన్ ముస్కాన్‌లో భాగం కానున్నాయి.