
న్యూఢిల్లీ, వెలుగు: ‘ఆపరేషన్ సిందూర్’, ఇండియా–పాకిస్తాన్ కాల్పుల విరమణ అంశాలపై చర్చ జరగాల్సిందే అని అపోజిషన్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని అన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, రాజ్యసభాపక్షనేత జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి 51 రాజకీయ పార్టీలకు చెందిన 54 మంది నేతలు హాజరయ్యారు.
పహల్గాం ఉగ్రదాడి, బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ, ట్రంప్ కాల్పుల విరమణ వాదనలు, మణిపూర్‌లో అశాంతి, నిరుద్యోగం, రైతుల సమస్యలు, దేశ విదేశాంగ విధానాలు వంటి అంశాలను సమావేశంలో అపోజిషన్ పార్టీలు లేవనెత్తాయి. దీనిపై జేపీ నడ్డా స్పందిస్తూ.. నిబంధనల ప్రకారం సభ నడిపేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. ఆపరేషన్ సిందూర్‌తో పాటు అపోజిషన్ పార్టీ సభ్యులు కోరిన అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి: ఆల్ పార్టీ నేతలు
ఆల్ పార్టీ మీటింగ్ లో కేంద్రాన్ని 3 ప్రశ్నలు అడిగామని కాంగ్రెస్ నేతలు ప్రమోద్ తివారీ, గౌరవ్ గొగోయ్ మీడియాకు తెలిపారు. ‘‘ఈసారి ప్రధాని మోదీ పార్లమెంట్ వేదికగా దేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతారని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నది. పహల్గామ్ దాడి, దానిపై లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ప్రకటన తీవ్రమైంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో కేంద్రం వైఖరేంటో స్పష్టం చేయాలి. రెండో అంశం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన సీజ్ఫైర్ ప్రకటన. దేశ గౌరవం, మన ఆర్మీ ధైర్యాన్ని ప్రశ్నించే లక్ష్యంగా ట్రంప్ కామెంట్లు ఉన్నాయి.
ట్రంప్ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో మోదీ సమాధానం చెప్పాలి. మూడో అంశం.. ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించింది. రాబోయే ఎన్నికలు, ప్రజాస్వామ్య నిర్మాణంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో ప్రధాని సమాధానం ఇవ్వాలి’’అని నేతలు అన్నారు. వాణిజ్య ఒప్పందం పేరుతో కాల్పుల విరమణ ప్రకటించేలా చేశానని ట్రంప్ చెప్తున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతరు: రిజిజు
ఆల్ పార్టీ మీటింగ్ స్నేహపూర్వక వాతావరణంలో ముగిసిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ‘‘ఫ్లోర్ లీడర్లు తమ తమ పార్టీల వైఖరిని స్పష్టం చేశారు. ఉభయ సభలు సక్రమంగా పనిచేసేలా చూడాలని అభ్యర్థించాం. పాలకపక్షం, ప్రతిపక్షం సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయి.
ఆల్ పార్టీ మీటింగ్లో సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు 100 మంది ఎంపీల సంతకాలు సేకరించాం. సంప్రదాయాలను ఫాలో అవుతూ అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్లపైనా చర్చిస్తం’’ అని కిరణ్ రిజిజు వెల్లడించారు.