కొందరికి హ్యాపీ.. ఇంకొందరికి బాధ: ఖమేనీ మృతిపై ఇరాన్‎లో భిన్నాభిప్రాయాలు

కొందరికి హ్యాపీ.. ఇంకొందరికి బాధ: ఖమేనీ మృతిపై ఇరాన్‎లో భిన్నాభిప్రాయాలు

టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపి మిస్సైల్ దాడిలో ఆయన మరణించారు. ఖమేనీ మృతిపై ఇరాన్‎లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నిచోట్ల సంబరాలు చేసుకుంటుండగా.. మరికొన్ని చోట్ల సంతాప ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖమేనీ మృతితో ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో కూరుకుపోగా.. ఖమేనీ ప్రభుత్య వ్యతిరేకులు రోడ్లపైకి వచ్చి నియంత శకం ముగిసిందంటూ ఆనందోత్సాహాలు చేసుకుంటున్నారు. 

ఖమేనీ సపోర్టర్స్ అమెరికా, ఇజ్రాయెల్‎కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తుండగా.. తమకు ఇప్పుడు నిజమైన స్వేచ్ఛ లభించిందంటూ ఖమేనీ వ్యతిరేకులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. షియా ముస్లింల ప్రధాన యాత్రాస్థలం మషద్‎లోని ఇమామ్ రెజా మందిరంపై నల్లజెండా ఎగరవేసి ఖమేనీ మద్దతుదారులు సంతాపం తెలిపారు. ఇదే సమయంలో టెహ్రాన్‎లోని పలు ప్రాంతాల్లో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటూ నినాదాలు చేస్తున్నారు. 

ఖమేనీ మృతితో ఇరాన్‎లోనే కాక లాస్ ఏంజిల్స్, లండన్, మెల్ బోర్న్ వంటి ప్రాంతాల్లో ఇరాన్ ప్రవాసులు వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు.. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులకు వ్యతిరేకంగా అమెరికాలో కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తం అయ్యాయి. అమెరికా-ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఆందోళకారుల నినాదాలు చేశారు. ఇండియాలోని శ్రీనగర్‌లో సైదా కదల్ ప్రాంతంలోని ప్రజలు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు నిరసనగా వీధుల్లోకి వచ్చారు.