సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్ష ఎంపీల ధర్నా

సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్ష ఎంపీల ధర్నా

పార్లెమంట్ వద్ద విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సేవ్ డెమొక్రసీ, సేవ్ ఇండియా అంటూ ప్లకార్డులతో ప్రదర్శనలు చేశారు. రాజ్యసభలో 12 మంది విపక్షసభ్యులపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలని సభ్యులు స్లోగాన్స్ చేశారు. వీ వాంట్ జస్టీస్ అంటూ విపక్ష సభ్యులు నినాదాలతో పార్లమెంట్ ఆవరణలో తమ ఆందోళన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. 12 మంది రాజ్యసభ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ చేశారు. దీనిపై మేం ఓ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 

ధాన్యం కొనుగోలు పై పార్లమెంట్ లో కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు. పార్లమెంటు వేదికగా ధాన్యం కొనుగోళ్లపై గందరగోళానికి తెరపడాలన్నారు. ఈ విషయంలో తాము ప్రతిపక్షంతోనే ఉన్ానమన్నారు. దీంతో పాటు 12 మంది రాజ్యసభ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ కూడా ఎత్తివేయాలన్నారు కేకే. మరోవైపు మంగళవారం 12మంది రాజ్య‌స‌భ స‌భ్యుల స‌స్పెన్ష‌న్ పై చ‌ర్చ జ‌రిగింది. 12మందిపై స‌స్పెన్ష‌న్ ఎత్తి వేయాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. క్ష‌మాప‌ణ చెప్పే ప్ర‌స్త‌క్తే లేద‌ని కాంగ్రెస్ నేత‌లు తేల్చి చెప్పారు. రాజ్య‌స‌భ‌ను బాయ్ కాట్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు విప‌క్ష నేత‌లు. 

పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే 12 మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వర్షాకాల సమావేశాల చివరి రోజున వీరు సభలో గందరగోళం సృష్టించినందుకు శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వీరిని సస్పెండ్ చేస్తూ సభ నిర్ణయం తీసుకుంది. ప్రియాంక చతుర్వేది (శివసేన), డోలా సేన్ (టీఎంసీ), ఎలమారం కరీం (సీపీఎం), కాంగ్రెస్ ఎంపీలు ఫులో దేవి నేతం, ఛాయా వర్మ, ఆర్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, సీపీఐకి చెందిన బినయ్ విశ్వం, టీఎంసీ ఎంపీ శాంత ఛేత్రి, శివసేన ఎంపీ అనిల్ దేశాయ్‌ రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.