
- బుల్డోజర్ జస్టిస్ ను ఇండియా కూటమి ఒప్పుకోదు: కాంగ్రెస్ చీఫ్
- పాత చట్టాలకే సవరణలు చేస్తే సరిపోయేదన్న చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్రం సోమవారం నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి మూడు కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్రం బలవంతంగా పార్లమెంటులో ఆమోదించిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. భారత పార్లమెంటరీ వ్యవస్థపై బుల్డోజర్ జస్టిస్" పెత్తనాన్ని ఇండియా కూటమి ఆమోదించదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఖర్గే సోమవారం ఎక్స్ ద్వారా కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై విమర్శలు గుప్పించారు.
ఎన్నికల్లో రాజకీయంగా, నైతికంగా దెబ్బతిన్న ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారు. 146 మంది ఎంపీలను బలవంతంగా సస్పెండ్ చేసి మూడు కొత్త క్రిమినల్ చట్టాలను ఆమోదించారనేది అసలు వాస్తవం. భారత పార్లమెంటరీ వ్యవస్థపై ఈ 'బుల్డోజర్ జస్టిస్' ఆధిపత్యాన్ని ఇండియా కూటమి ఆమోదించదు. చర్చ లేకుండానే బిల్లులను చట్టాలుగా మార్చడమే ఇండియా కూటమి ప్రధాన సమస్య. కొత్త చట్టాలపై చర్చ చాలా అవసరం" అని గతేడాది శీతాకాల సమావేశంలో జరిగిన ఘటనను పేర్కొంటూ ఖర్గే ట్వీట్ చేశారు.
పార్లమెంటులో భద్రతా వైఫల్యానికి వ్యతిరేకంగా గతేడాది నిరసన తెలిపిన146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఆ సమయంలోనే బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్యా అధినియం (బీఎస్ఏ) అనే కొత్త న్యాయ చట్టాలు పార్లమెంటు ఆమోదం పొందాయి.
ఇది వ్యర్థ ప్రయాసే: చిదంబరం
కొత్త క్రిమినల్ చట్టాల అమలు ఓ వ్యర్థ ప్రయాసలాగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. ఉన్న చట్టాలకే సవరణలుచేస్తే సరిపోయేదని అభిప్రాయపడ్డారు." కొత్త న్యాయ చట్టాల్లో 90-–99% పాత వాటి నుంచి కాపీ కొట్టారు. కేంద్రం మెరుగులుదిద్దిన అంశాలను ఇప్పటికే ఉన్న చట్టాల్లో సవరణలు చేస్తే సరిపోయేది. ప్రస్తుతం తెచ్చిన కొత్త చట్టాల్లోని కొన్ని అంశాలు కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి" అని చిదంబరం పేర్కొన్నారు.
30 గంటలు చర్చించామన్న కేంద్రమంత్రి
దేశ చరిత్రలో ఈ కొత్త చట్టాలపై చర్చించినంతగా ఏ చట్టాలపై చర్చ జరగలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మొత్తం 118 సమావేశాలు, 30 గంటలపాటు చర్చ జరిగింది. దేశానికి పూర్తి స్థాయి స్వదేశీ న్యాయవ్యవస్థ లభించింది" అని పేర్కొన్నారు.