ప్రతిపక్షాలు నెగెటివ్ పాలిటిక్స్ చేస్తున్నయ్: ప్రధాని మోదీ

ప్రతిపక్షాలు నెగెటివ్ పాలిటిక్స్ చేస్తున్నయ్: ప్రధాని మోదీ
  • అవినీతి, కుటుంబ రాజకీయాలకు ఇక దేశంలో చోటు లేదు
  • పని చేసేవాళ్లను అడ్డుకోవడమే వాళ్ల ఫార్ములా  
  • 508 రైల్వే స్టేషన్ల రీడెవలప్​మెంట్​కు ప్రధాని శంకుస్థాపన
  • తెలంగాణలో 21 రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు
  • అవినీతి, కుటుంబ రాజకీయాలు ఇక క్విట్ ఇండియా

న్యూఢిల్లీ: అవినీతి, కుటుంబ, బుజ్జగింపు రాజకీయాలను అంతం చేసేందుకు దేశం ఏకమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఆ దుష్టశక్తులను తరిమేసేందుకు యావత్తు దేశమంతా క్విట్ ఇండియా అని గర్జిస్తోంది” అని చెప్పారు. దేశంలో ప్రతిపక్షాలు నెగెటివ్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను రీడెవలప్ చేసేందుకు సంబంధించిన పనులకు ప్రధాని ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాల కూటమిపై పరోక్షంగా మండిపడ్డారు. ‘‘ఆగస్టు 9న క్విట్ ఇండియా డేను జరుపుకొంటున్న తరుణంలో దేశమంతా ఆ ఉద్యమం నుంచి స్ఫూర్తి పొందుతోంది. మహాత్మా గాంధీ పిలుపుతో నాడు స్వాతంత్ర్యం కోసం క్విట్ ఇండియా పోరాటం జరిగింది. దాని స్ఫూర్తితో నేడు దేశమంతా చెడును తరిమికొట్టేందుకు క్విట్ ఇండియా అని నినదిస్తోంది”  అని మోదీ చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంతో రైల్వేలో కొత్త చరిత్ర మొదలైందన్నారు.  

అడ్డుకోవడమే వాళ్ల పని  
ప్రతిపక్షాలలో ఓ వర్గం పని చేసేవాళ్లను అడ్డుకోవడమే పనిగా పెట్టుకుందని ప్రధాని ఫైర్ అయ్యారు. ‘‘ప్రతిపక్షంలో ఓ వర్గం ఉంది. ఈ రోజుకూ పాత విధానాలనే ఫాలో అవుతుంటుంది. ఏ పని చేయకుండా, చేసే వాళ్లనూ అడ్డుకోవడమే పాలసీగా పెట్టుకున్నారు” అని ఆయన విమర్శించారు. ‘‘దేశ ప్రజాస్వామ్యానికి చిహ్నమైన పార్లమెంట్ కు కొత్త బిల్డింగ్ కట్టినా వ్యతిరేకించారు. కర్తవ్య పథ్​ను తీర్చిదిద్దినా అడ్డుకోవాలని చూశారు. 70 ఏండ్లు పాలించినా కూడా వారు కనీసం వార్ మెమోరియల్ కూడా కట్టలేదు. కానీ మేం నేషనల్ వార్ మెమోరియల్ ను కడితే.. సిగ్గు లేకుండా దానిపైనా పబ్లిక్ గా విమర్శలు చేశారు” అని మండిపడ్డారు. 

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్విస్తుంటే.. కొన్ని పార్టీల పెద్ద లీడర్లు కనీసం అక్కడికి వెళ్లి నివాళులు కూడా అర్పించలేదన్నారు. వాళ్లే మళ్లీ ఎన్నికలు రాగానే సర్దార్ పటేల్ పేరును వాడుకుంటారన్నారు. తాము మాత్రం నెగెటివ్ పాలిటిక్స్ కు అతీతంగా, అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యమిచ్చే పాజిటివ్ పాలిటిక్స్ ను ఒక మిషన్ లాగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. 

 

508 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ 
‘అమృత్ భారత్ స్టేషన్’  స్కీం కింద దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, యూటీల్లోని 508 రైల్వే స్టేషన్లను రీడెవలప్ చేసేందుకు మెగా ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకోసం రూ.24,470 కోట్లు కేటాయించారు. రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్లకు ఆధునిక సౌలతుల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపర్చడం, ప్యాసింజర్​ ట్రైన్ల సైన్ బోర్డుల ఆధునికీకరణ, లోకల్ కల్చర్, ఆర్కిటెక్చర్, హెరిటేజ్​కు అనుగుణంగా స్టేషన్ బిల్డింగ్​లను డిజైన్ చేయడం వంటి పనులను ఈ స్కీం కింద చేపట్టనున్నట్లు ప్రధాన మంత్రి ఆఫీస్(పీఎంవో) వెల్లడించింది. 

ఈ స్కీం కింద మొత్తం 1,309 రైల్వే స్టేషన్లను రీడెవలప్ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రీడెవలప్ చేసే 508 స్టేషన్లలో యూపీ, రాజస్థాన్ లలో 55 చొప్పున, బీహార్​ 49, మహారాష్ట్ర 44, బెంగాల్ 37, మధ్యప్రదేశ్ 34, అస్సాం 32, ఒడిశా 25, పంజాబ్​22, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున, జార్ఖండ్ 20, ఏపీ, తమిళనాడులో 18 చొప్పున, హర్యానా 15, కర్నాటక 13 ఉన్నాయని పీఎంవో పేర్కొంది.

పంద్రాగస్టున ప్రతి ఇంటిపైనా జెండా ఎగరాలే..
దేశంలో అభివృద్ధికి కొత్త రెక్కలు వచ్చాయని, దేశ ముఖచిత్రం మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా10 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో కేంద్రం రోజ్ గార్ మేళాను నిర్వహిస్తోందన్నారు. నేటి యువతకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయన్నారు. 

దేశంలో ఇన్ కం ట్యాక్స్ రిటర్న్ లు ఫైల్ చేసేటోళ్ల సంఖ్య గత ఏడాది కాలంలో 16% పెరిగిందని, ప్రభుత్వంపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి ఇదే నిదర్శనమన్నారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నందునే ప్రపంచ వేదికపై ఇండియాకు గౌరవం పెరిగిందన్నారు. పోయిన ఏడాది లాగే ఈ ఏడాది పంద్రాగస్టు రోజున కూడా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేసి, దేశం పట్ల మన డెడికేషన్ ను చాటుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.