ఇండియాలోనే 12 వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేసిన ఒరాకిల్.. మరో రౌండ్ ఉందంటూ వార్తలు..!

ఇండియాలోనే 12 వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేసిన ఒరాకిల్.. మరో రౌండ్ ఉందంటూ వార్తలు..!

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ Oracle తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల కోతలతో ఖర్చులు తగ్గించుకుంటున్న కంపెనీ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని లేఆఫ్స్ తో మెుదలు పెట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో పెద్ద ఎత్తున కోతలు విధిస్తోంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. 

ఒరాకిల్ సంస్థ భారత్‌లో సుమారు 12వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు అంచనా. ఇండియాలో కంపెనీకి మొత్తం 30వేల మంది సిబ్బంది ఉండగా.. అందులో దాదాపు 40 శాతం మందిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడితో ఈ ప్రక్రియ ముగియలేదని.. వచ్చే నెలలో మరో రౌండ్ లేఆఫ్స్ ఉండే అవకాశం ఉందని కంపెనీ వర్గాలే చెబుతున్నాయి. ప్రస్తుతం తొలగించబడిన ఉద్యోగులకు తెల్లవారుజాము సమయంలో కంపెనీ నుంచి తొలగింపునకు సంబంధించిన అధికారిక మెయిల్స్ వచ్చాయని తెలుస్తోంది. మెుత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఒరాకిల్ సుమారు 30వేల మంది ఉద్యోగాలను తగ్గించుకుంది.

సంస్థాగత మార్పుల కారణంగా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఈ తొలగింపుల నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఉద్యోగులు నిర్వహిస్తున్న బాధ్యతలు కంపెనీకి "అవసరం లేనివి"గా మారాయని తొలగింపునకు కారణంగా పేర్కొంది ఒరాకిల్. అయితే తెర వెనుక అసలు కారణం ఏంటంటే కంపెనీ ఏఐ కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఓపెన్ ఏఐతో కుదుర్చుకున్న బిలియన్ డాలర్ల ఒప్పందం తర్వాత, ఏఐ మౌలిక సదుపాయాల కోసం నిధులను మళ్లించే క్రమంలో ఈ లేఆఫ్స్ నిర్ణయం తీసుకుందని తేలింది. 

సెవెరెన్స్ ప్యాకేజీ వివరాలు:

ఉద్యోగం కోల్పోయిన వారికి ఒరాకిల్ కొంతమేర ఆర్థిక ఊరటనిచ్చే ప్యాకేజీని ప్రకటించింది.
* కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతం.
* టర్మినేషన్ తేదీ వరకు ఒక నెల అన్-పెయిడ్ వేతనం.
* అర్హులైన ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ.
* ఒక నెల నోటీసు పీరియడ్ జీతంతో పాటు, అదనంగా రెండు నెలల జీతం.
అయితే ఈ ప్యాకేజీ కంపెనీకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని షరతు విధించటం గమనార్హం.

►ALSO READ | విమాన ఇంధనం కిలోలీటర్ రూ.2 లక్షలు: డబుల్ కానున్న విమానం టికెట్ రేట్లు..!

తొలగింపుల ప్రక్రియపై బాధిత ఉద్యోగుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమెరికా వంటి దేశాల్లో స్థానిక చట్టాలు కఠినంగా ఉండటంతో.. అక్కడ పనిచేస్తున్న భారతీయులను ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నారని మాజీ ఉద్యోగి మెరుగు శ్రీధర్ ఆరోపించారు. ఎక్కువ పని గంటలపై నిరసన తెలిపిన వారిని కూడా టార్గెట్ చేశారని అన్నారు.

ఒకవైపు లేఆఫ్స్ జరుగుతున్నా.. మరోవైపు ఒరాకిల్ తన వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోంది. కొత్త నాయకత్వం ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. భవిష్యత్తు అంతా ఏఐ అని నమ్ముతున్న టెక్ దిగ్గజం.. అందుకు తగ్గట్టుగా పాత విధానాలను, సిబ్బందిని తొలగించి స్ట్రీమ్ లైన్ చేస్తోంది. అయితే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి భారీ లేఆఫ్స్ టెక్ కంపెనీల నుంచి కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.