
- భారీ నుంచి అతి భారీ వర్షాలు
- కురిసే చాన్స్ ఉందన్న వాతావరణ శాఖ
- డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్ధంగా ఉండాలంటూ మేయర్, కమిషనర్ సూచన
హైదరాబాద్, వెలుగు: సిటీ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచే ముసురు పట్టి ఉంది. సాయంత్రం వరకు చాలా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. రాత్రి 7 గంటల తర్వాత భారీ వాన మొదలవడంతో రోడ్లపై నీరు నిలిచి మెయిన్ రోడ్లపై ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఆది, సోమ వారాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వానల పడొచ్చని పేర్కొంది. శుక్రవారం రాత్రి ఆర్ సీపురం, హఫీజ్ పేట, సీతాఫల్ మండి, మాదాపూర్, కేపీహెచ్‌బీ, బేగంపేట, సికింద్రాబాద్, అల్వాల్, ఏఎస్ రావు నగర్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్‌తో పాటు పలు ఏరియాల్లో వర్షం కురిసింది.
అత్యధికంగా రామంతాపూర్ వార్డు ఆఫీసు ఏరియాలో 7.13 సెం.మీల వాన పడింది. తెలంగాణాపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గ్రౌండ్ లెవెల్లో పని చేస్తున్న సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచే పాయింట్ల దగ్గర టీమ్స్ అలర్ట్‌గా ఉండాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. వికారాబాద్ జిల్లాలోనూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది.అత్యధికంగా కొడంగల్‌లో 5.39 సెం.మీల వాన పడింది.