జనగామలో అడ్వొకేట్లపై దాడికేసు పోలీసులపై విచారణకు ఆదేశం

జనగామలో అడ్వొకేట్లపై దాడికేసు పోలీసులపై విచారణకు ఆదేశం
  •      బుధవారం ఆందోళనలకు సిద్ధమైన లాయర్లు  
  •     ఛలో జనగామ, ఛలో హైకోర్టుకు పిలుపు 

జనగామ, వెలుగు : జనగామ పోలీస్​స్టేషన్​కు ఓ కేసు విషయం గురించి మాట్లాడేందుకు వెళ్లిన అడ్వొకేట్​దంపతులు అమృతరావు, కవితలపై దాడి ఘటనలో పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు. దాడిపై రాష్ట్రవ్యాప్తంగా అడ్వొకేట్లు ఆందోళనలకు దిగడంతో పాటు బుధవారం చలో జనగామ, చలో హైకోర్టులకు పిలుపునిచ్చారు. బార్ సోసియేషన్ స్టేట్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొండల్ రెడ్డి  చలో జనగామకు పిలుపునిచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల బార్ సోసియేషన్ సభ్యులు బుధవారం జనగామ కోర్టుకు చేరుకొని నిరసన తెలపాలని కోరారు.  

మరోవైపు అడ్వకేట్ జాక్ కూడా చలో హైకోర్టుకు పిలుపునిచ్చింది. దీంతోపాటు బాధితులు, జనగామ బార్ అసోసియేషన్ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో ఘటనపై విచారణకు ఆదేశిస్తూ జనగామ డీసీపీ  రాజమహేంద్ర నాయక్ ఉత్తర్వులు ఇచ్చారు.  

కారకులను సస్పెండ్​ చేయాలని రాస్తారోకో

అడ్వొకేట్​దంపతులపై దాడి చేసిన జనగామ సీఐతో పాటు ఎస్సై తిరుపతిని సస్పెండ్​ చేయాలంటూ జనగామ అడ్వొకేట్లు  జిల్లా కేంద్రంలోని సిద్ధిపేట రోడ్​ ఆర్అండ్​బీ గెస్ట్ హౌస్​ చౌరస్తాలో మంగళవారం రాస్తారోకో చేశారు. జనగామ ఏపీసీ పార్థసారధి వచ్చి అడ్వొకేట్లకు సర్ధి చెప్పారు. బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. బార్ ​అసోసియేషన్​ అధ్యక్షుడు చంద్రరుషి, ఇతర లాయర్లు పాల్గొన్నారు.