ఎంబీబీఎస్‌, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ ఉత్తర్వులు

ఎంబీబీఎస్‌, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ ఉత్తర్వులు

రాష్ట్రంలో ఉంటూ మెడిసిన్ చదవాలనుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో MBBS, BDS - బీ కేటగిరీ సీట్లలో కేటాయించే 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకే దక్కేలా అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 129, 130 లను రిలీజ్ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని వెయ్యి 68 MBBS  సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. రాష్ట్రంలో 20 నాన్ మైనారిటీ, 4 నాన్ మైనారిటీ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 3 వేల 750 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

నాన్ మైనార్టీ కాలేజీల్లో 3 వేల 200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 35 శాతం అంటే 11 వందల 20 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. తాజా సవరణతో బీ కేటగిరీలో ఉన్న 35% సీట్లలో 85% సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15% అంటే 168  సీట్లు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడతారు. ఓపెన్ కోటా కావడంతో ఇందులోనూ తెలంగాణ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ఇలానే మైనార్టీ కాలేజీలో 25 శాతం బీ కేటగిరీ కింద ఇప్పటి వరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు ఇక్కడి విద్యార్థులకే దక్కనున్నాయి.