కడెం ప్రాజెక్ట్ పరిస్థితిపై ఓఎస్డీ వివరణ

కడెం ప్రాజెక్ట్ పరిస్థితిపై ఓఎస్డీ వివరణ

నిర్మల్: భారీ వరదల నేపథ్యంలో కడెం ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఊహించని రీతిలో ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్ట్ తెగిపోయే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ప్రాజెక్ట్ వద్దకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ క్రమంలోనే కడెం ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి గురించి ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే వివరించారు. కడెం డ్యాం డిశ్చార్జ్ సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులని, ఇప్పటికే అన్ని గేట్లు ఓపెన్ చేసి పెట్టినట్లు తెలిపారు. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు మించి వస్తుంటే ఫ్లడ్ మేనేజ్ మెంట్ చేయడం ఎవరికీ  కుదరదని, కాబట్టి డిజాస్టర్ మేనేజ్ మెంట్ కు సిద్ధపడటం తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితి 1995 లో కూడా ఎదురైందని, చిన్నపాటి డ్యామేజీతో ఆనాడు ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పారు. 

ఏదైనా అనుకోనిది జరిగితే ఎదుర్కోవడానికి ఇంజనీర్లు, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా.. కడెం ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలోని ప్రజలను ఇప్పటికే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. పశువులు కాపరులు, రైతులు, మత్స్యకారులెవరూ బయటికి రావొద్దని హెచ్చరించారు. ఇకపోతే.. అంత ప్రమాదకర స్థితిలో కూడా ప్రాజెక్టు ఇంజనీర్లు గేజింగ్ రూం లో ఉండి వరద స్థితిని అంచనా వేస్తూ ఉన్నారు. వారు అత్యంత సాహసంతో, ధైర్యంతో ఈ పనిలో నిమగ్నం అయ్యారు. ఎస్ఈ సుశీల్  కుమార్, ఈఈ రాజశేఖర్, మిగతా ఇంజనీర్లు, సిబ్బంది అక్కడి ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.