పోలీసుల అదుపులో ఓఎస్డీ వేణుగోపాల్‌‌రావు

 పోలీసుల అదుపులో ఓఎస్డీ వేణుగోపాల్‌‌రావు
  •     టాస్క్​ఫోర్స్​ మాజీ డీసీపీ రాధాకిషన్​రావు వాంగ్మూలం ఆధారంగా నోటీసులు
  •     బంజారాహిల్స్‌‌‌‌ పీఎస్‌‌లో11 గంటల పాటు విచారణ
  •     నేరం అంగీకరించడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు :  ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసులో ఎస్‌‌ఐబీ రిటైర్డ్‌‌ అడిషనల్‌‌ ఎస్పీ (ఓఎస్డీ) వేణుగోపాల్‌‌రావును స్పెషల్‌‌ టీమ్‌‌ పోలీసులు బుధ వారం అదుపులోకి తీసుకున్నారు. గురువారం జడ్జి ఎదుట హాజరుపరిచి, రిమాండ్‌‌కు తరలించనున్నారు. బుధవారం ఉదయం నుంచి దాదాపు 11 గంటల పాటు వెస్ట్‌‌జోన్‌‌ డీసీపీ విజయ్‌‌కుమార్ ఆధ్వర్యంలో వేణుగోపాల్​రావును విచారించారు. ఈ కేసులో నిందితులైన ప్రణీత్‌‌రావు, రాధాకిషన్​ ఇచ్చిన సమాచారంతో విచారణ చేపట్టారు. 

ఫోన్‌‌ట్యాపింగ్‌‌, ఎస్‌‌ఐబీలో జరిగిన అక్రమాలపై వేణుగోపాల్‌‌రావు నుంచి  పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ఆయన నేరం అంగీకరించడంతో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. టాస్క్‌‌ఫోర్స్‌‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌‌ రావు రిమాండ్ రిపోర్ట్‌‌లో వేణుగోపాల్‌‌ రావు పేరు వెల్లడించారు. రాధాకిషన్​రావు వాంగ్మూలం ఆధారంగా వేణుగోపాల్​రావుకు పోలీసులు నోటీసులు జారీచేసి, విచారించారు. ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్‌‌ ప్రభాకర్‌‌రావు ఏర్పాటు చేసిన స్పెషల్‌‌ ఆపరేషన్‌‌ టీమ్‌‌లో సైబరాబాద్‌‌ కమిషనరేట్‌‌కు వేణుగోపాల్‌‌రావు నాయకత్వం వహించారు.

ఈ క్రమంలోనే రాచకొండ కమిషనరేట్‌‌కు భుజంగరావు,హైదరాబాద్‌‌కు తిరుపతన్న, నల్గొండకు ప్రణీత్‌‌రావు, టాస్క్‌‌ఫోర్స్‌‌కు రాధాకిషన్‌‌రావు నాయకత్వం వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది.సైబరాబాద్‌‌కు వేణుగోపాల్‌‌ రావు స్పెషల్‌‌ ఆపరేషన్‌‌ టీమ్‌‌ను నిర్వహిస్తూ ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కుట్రలో కీలకంగా వ్యవహరించినట్టు వెలుగులోకి వచ్చింది.1989 ఎస్ఐ బ్యాచ్‌‌కు చెందిన వేణుగోపాల్‌‌రావుది వరంగల్‌‌జిల్లా పర్వతగిరి. 

రిటైర్​మెంట్​ తర్వాత కూడా వేణుగోపాల్‌‌రావు గత ఏడేండ్లుగా ఎస్‌‌ఐబీలో అడిషనల్‌‌ ఎస్పీ(ఓఎస్డీ) హోదాలో కొనసాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒకే సామాజిక వర్గం ఈక్వేషన్‌‌లో భాగంగానే వేణుగోపాల్‌‌ రావును ఎస్‌‌ఐబీలో నియమించినట్టు తేలింది. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఆపరేషన్స్ చేశానని వేణుగోపాల్​రావు విచారణలో వెల్లడించినట్టు సమాచారం.