
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మెస్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 13వ తేదీన యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ముందు పీహెచ్డీ విద్యార్థినిలు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో చేసిన అధికారులు స్పందించకపోవడంతో.. వర్సిటీ పరిపాలన భవనం ముందు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని బలవంతంగా లాక్కెళ్లారు.
గతంలో లేనివిధంగా మెస్ లో నూతన పద్ధతులు తీసుకొచ్చి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మెస్ బిల్ ఎన్ని రోజులు తింటే అన్ని రోజులే వస్తుండేదని..కానీ ఇప్పుడు తక్కువ రోజులు భోజనం చేసినా.. 30 రోజులకు మెస్ బిల్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ లో 30 మంది కోసం వండి..దాన్ని నూతనంగా చేరిన మరో 30 మంది స్కాలర్స్ కూడా పెడుతున్నారని మండిపడ్డారు. సరిపడినంత భోజనం కూడా వడ్డించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు.
పీహెచ్డీ విద్యార్థులైన తమ పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. గంటల తరబడి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వర్సిటీ వీసీ స్పందించకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు తగ్గేది లేదని హెచ్చరించారు.