
ఒక్కడినే వస్తా.. ఒక్కడినే పోరాడతా.. అడవిలో నక్కలు, తోడేళ్లు, జంతువులు ఎన్నో ఉంటాయి.. కానీ సింహం ఒంటరిగా ఉంటుంది.. ఒంటరిగా పోరాడుతుంది.. ఇది.. నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ భారీ బహిరంగ సభలో ఉర్రూతలూగించిన డైలాగ్. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత పెట్టిన రెండో మహానాడులో విజయ్ స్పీచ్ కు సభ దద్ధరిల్లిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఏదో చేసేలా ఉన్నాడు.. అనుకునేలా గురువారం (ఆగస్టు 21) ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ సాగింది.
తమిళగ వెట్రి కజగం పార్టీ రెండో మహానాడు తమిళనాడు మధురై జిల్లాలో లక్షలాది జనసందోహం నడుమ జరిగింది. ఈ సభకు దాదాపు 4 లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన స్టేట్ మెంట్స్ తమిళ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి.
తమకు బీజేపీ, డీఎంకే రెండూ శత్రువులేనని స్పంష్టం చేశారు విజయ్. బీజేపీ ఐడియాలజీ పరంగా శత్రువైతే.. డీఎంకే రాజకీయ శత్రువు అని అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే వస్తానని.. పొత్తు కోసం ప్రయత్నించే వారికి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ డీఎంకేతోనేనని స్పష్టం చేశారు.
పోటీ అక్కడి నుంచే:
వచ్చే ఎన్నికల్లో తను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో ముందే ప్రకటించారు విజయ్. మధురై ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు అనౌన్స్ చేశారు. మధురై జిల్లాలో ఉన్న పది స్థానాల్లో ఎక్కణ్నుంచైనా పోటీ చేస్తానని.. టీవీకే క్యాడర్ మిగతా 234 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని.. టీవీకే కు ఓటు వేస్తే అది తనకు ఓటేసినట్లేనని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
సీఎం స్టాలిన్ పై ఘాటు విమర్శలు:
డీఎంకే అధ్యక్షులు, సీఎం స్టాలిన్ పై విజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడు ప్రజలను స్టాలిన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి మహిళలను, ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. 2026 ఎన్నికల్లో డీఎంకేను గద్దె దించాలని కేడర్ కు పిలుపునిచ్చారు.
బీజేపీపై బ్లాస్ట్ అయిన విజయ్:
ప్రధాని మోదీ, బీజేపీలపై విజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళనాడు ప్రజల అవసరాలను, కష్టాలను అర్థం చేసుకోవడంలో బీజేపీ విఫలమైందని అన్నారు. NEET వివాదం, మత్స్యకారుల సమస్యలు, ఇతర సమస్యలను తీర్రచలేకపోయిందని అన్నారు.
మరోవైపు ఏఐఏడీఎంకే పార్టీ ప్రస్తుత నాయకత్వం కారణంగా కేడర్ అసంతృప్తితో ఉందని మండిపడ్డారు. బీజేపీ కనుసన్నల్లో పార్టీని నడుపుతండటంతో కేడర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఎంజీ రామచంద్రన్ ఏర్పాటు చేసిన పార్టీ పరిస్థితి ఇలా కావడానికి కారణం ఆ పార్టీ నేతల అసమర్థతేనని విమర్శించారు.
టీవీకే పార్టీ ప్రాధాన్యతలు ఇవే:
టీవీకే ప్రాధాన్యతలేంటో చెప్పారు ఆ పార్టీ అధ్యక్షులు విజయ్. మహిళలు, బాలికలు, వృద్ధుల క్షేమమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. యువకులు, రైతులు, కూలీలు, మత్స్యకారులు, వయోవృద్ధులు.. ఇలా అందరి సంక్షేమం కోసం తాము అధికారంలోకి వస్తామని చెప్పారు.