
ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు పేరు రావాలనే పోలవరం నుంచి బనకచర్ల ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. పోలవరం బనకచర్ల మరో కాళేశ్వరం అవుతుందని అన్నారు డీఎల్. చంద్రబాబు రాజోలు నుంచి నీరు ఇస్తానని రూ. 3 వేల కోట్ల విలువైన హామీలు ఇచ్చారని అన్నారు.
రాజోలుకు ఇచ్చే రూ. వెయ్యి కోట్లు లేనప్పుడు రూ.80 వేల కోట్ల బనకచర్ల ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు డీఎల్. రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన పనులు ఏమీ జరగడం లేదని అన్నారు. అలగనూరు ప్రాజెక్టు గురించి ఒప్పుకుంటాము కానీ ముందు రాజోలి గురించి ఎందుకు ఆలోచించలేదన్నారు డీఎల్.రిజర్వాయర్లలో నీళ్లు పెడితే సరిపోదు ఆయకట్టు అభివృద్ధి చెందాలని... రిజర్వాయర్లు నిండితే మీ ప్రాంతంలో చెరువులకు నీటిని నింపుతామని జీవో ఇవ్వాలన్నారు డీఎల్.
ప్యారసెటమాల్ కరువు:
రియల్ టైం గవర్నెన్స్ అంటే ఇంటి దగ్గర బల్బు పోతే అది పోయిందని చెప్పడం అని ఒక ఐఏఎస్ అధికారి అంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. గిరిజన ప్రాంతాల్లో పారాసిటమల్ మాత్ర లేక చనిపోయిన పరిస్థితి వుందని... పారాసిటమాల్ మాత్ర ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ విషయం పై ప్రభుత్వానికి లేఖ రాశానని... మెయిల్ చేసినా కూడా స్పందన లేదని అన్నారు డీఎల్.ఆరోగ్యశాఖ మంత్రి గిరిజన ప్రాంతాల్లో తొంగి చూసిన పరిస్థితి కూడా లేదని అన్నారు డీఎల్.
ఒక్క కొత్త పించన్ అయినా ఇచ్చారా:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని అన్నారు డీఎల్.44 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యపై ధర్నా చేద్దామనుకున్నానని... సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఊరిలో పెన్షన్ ఇవ్వడానికి వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు డీఎల్. అసలైన వికలాంగుల పెన్షన్లు తీసేసి అనర్హుల పెన్షన్లు కొనసాగిస్తున్నారని... పెన్షన్లు కొనసాగించేందుకు బ్రోకర్లు కూడా ఉన్నారని మండిపడ్డారు డీఎల్.ఓట్లు వేసిన పాపానికి ప్రజలు రోజు ఎందుకు ఏడవాలని ఆయన ప్రశ్నించారు.