
ఇద్దరూ సహోద్యోగులు. అతనికి పెళ్లైంది. ఆమెకు కూడా పెళ్లైనప్పటికీ భర్తతో విభేదాల కారణంగా విడిపోయి తన పుట్టింట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. సహోద్యోగి కావడంతో ఆమె ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే అతని మనసులో పాడు బుద్ధి పుట్టింది. తను కూడా భార్యను వదిలేస్తానని.. తనతో కలిసి ప్రియురాలిగా ఉండాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు.
పక్కాగా ప్లాన్ చేసి కారులో సరదాగా అలా వెళ్లొద్దామని చెప్పి ఎక్కించుకుని కారును నేరుగా చెరువులోకి పోనిచ్చాడు. ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి అతను ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆమె కారులోనే ప్రాణాలు కోల్పోయింది. కారు ప్రమాదవశాత్తూ చెరువులోకి వెళ్లిందని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతని గురించి విచారించి ఆమెను హత్య చేసి చంపేశాడని తేల్చారు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగింది. నిందితుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చనిపోయిన మహిళను అతని సహోద్యోగి శ్వేతగా పోలీసులు గుర్తించారు. చందనహళ్లి లేక్లోకి కారును తోసేసి ప్రియురాలిని రవి చంపేశాడు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి రెస్క్యూ టీమ్స్ ఆ కారును, కారులో ఉన్న శ్వేత మృతదేహాన్ని బయటకుతీశారు. శ్వేత తల్లిదండ్రుల ఫిర్యాదుతో రవిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
వివాహేతర సంబంధాలు, పరిచయాలు ఎలాంటి అనర్ధాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రమాదవశాత్తూ కారు అదుపు తప్పి లేక్లోకి వెళ్లిపోయిందని రవి నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల విచారణలో నిజం చెప్పక తప్పలేదు. నేరం చేసి బయటపడొచ్చని భావించే వారికి ఈ ఉదంతం ఒక గుణపాఠం అని చెప్పొచ్చు.