నాపై దాడిలో మార్వాడీలకు సంబంధం లేదు.. బాయ్ కాట్ ప్రచారంతో సంబంధం లేదు : మోండా మోర్కెట్ బాధితుడు

నాపై దాడిలో మార్వాడీలకు సంబంధం లేదు.. బాయ్ కాట్ ప్రచారంతో సంబంధం లేదు : మోండా మోర్కెట్ బాధితుడు

మార్వాడీ గోబ్యాక్.. మార్వాడీ గోబ్యాక్.. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న నినాదం ఇది. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. పొలిటీషియన్స్ నుంచి సామాన్య ప్రజల వరకు అందరి నోటా ఇదే మాట. మార్వాడీలు ముఠాగా ఏర్పడి స్థానిక వ్యాపారస్థుల పొట్ట కొడుతున్నారని.. ఎదగనీయటం లేదని.. మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని ఒక రాజకీయ యుద్ధమే మొదలైంది. 

అయితే ఈ ఉద్యమానికి మూలబిందువైన ఘటనకు సంబంధించి బాధితుడు చేసిన స్టేట్ మెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు మార్వాడీల దాడికి నిరసన చెబుతూ.. తనకు న్యాయం చేయాలని రోడ్డెక్కిన బాధితుడు.. చివరికి ఈ ఉద్యమానికి, మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాడు.  సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో తనపై జరిగిన దాడికి మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని దాడిలో గాయపడిన బాధితుడు సాయి పేర్కొన్నాడు.  కేవలం తనకు, SK జువెల్లర్స్ కు మధ్య మాత్రమే వివాదం జరిగిందని తెలిపాడు. 

గురువారం (ఆగస్టు 21) మార్వాడీ సంఘాలకు, బాధితుని కుటంబ సభ్యులకు మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఆ తర్వాత మీడియా సమావేశంలో ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు బాధితుడు సాయి ప్రకటించాడు. సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో మార్వాడీ అసోసియేషన్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో.. ఈ దాడికి మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. బాయ్ కాట్ మార్వాడీస్.. గో బ్యాక్ మార్వాడీస్ ప్రచారంతో తనకు సంబంధం లేదని ప్రకటించాడు.

రోడ్ పై హారన్  వేయడం తో జరిగిన మొదలైందని.. అది  ఎస్సీ ఎస్టీ  అట్రాసిటీ కేసు వరకు వెళ్లిందని చెప్పాడు బాధితుడు సాయి. అయితే  గొడవకు పాట్ మార్కెట్ వ్యాపారస్తులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. మరోవైపు గొడవ జరిగినప్పుడు మార్వాడీ సమాజం తనతోనే ఉందని, హాస్పిటల్ లో తనకు అన్ని విధాల సహాయం అందించారని చెప్పాడు. ఈ దాడిపై సోషల్ మీడియాలో, మీడియాలో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని.. దీనికి ముగింపు చెప్పడానికే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశామని తెలిపాడు. 

SK జువెల్లర్స్ ఓనర్స్ డబ్బు మదంతోనే దాడి చేశారని చెప్పాడు బాధితుడు సాయి. కులం పేరుతో దూషించింది కూడా నిజమేనని అన్నాడు. దాడి జరిగిన తర్వాత మార్వాడీ సమాజం అంతా తమతోనే ఉందని.. పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయ్యేవరకు తోడున్నారని తెలిపాడు. ఎన్నో ఏళ్లుగా టకారా బస్తీ వాసులు, మార్వాడీలు కలిసి మెలిసి ఉంటున్నామని.. తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం తెలిపాడు. భవిష్యత్తులో కూడా కలిసే ఉంటామని తెలిపాడు. ఈ వివాదంపై ఇప్పటికే మీడియా ముఖంగా మాట్లాడేవాళ్లమని కానీ.. రాష్ట్రవ్యాప్తంగా వివాదం చెలరేగడం, కోర్టులో ఉండటంతో మీడియా ముందుకు రావద్దని పోలీసులు చెప్పడం వల్లనే ఆగినట్లు తెలిపారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపాలని.. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటామని తెలిపారు.

మార్వాడీ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ.. మోండా మార్కెట్ లో జరిగిన దాడికి, మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. SK జువెలర్స్ యాజమాన్యంపై సంఘంలో మాట్లాడి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.