
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ' విశ్వంభర'. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీనికి గల కారణాలను చిరంజీవి వివరించారు. 2026 సమ్మర్‌లో విడుదల చేస్తున్నట్లు అప్ డేట్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో రేపు ( ఆగస్టు 22 ) చిరంజీవి బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేలా మూవీ మేకర్స్ 'విశ్వంభర ' గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇది అభిమానులకు చిరు పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.
ఈ 'విశ్వంభర' గ్లింప్స్‌లో వీఎఫ్‌ఎక్స్ మరియు విజువల్స్ హైలైట్‌గా నిలిచాయి. 'ఈ విశ్వంభరలో అసలేం జరిగిందో ఈరోజైనా చెప్తావా?' అన్న పిల్లాడి డైలాగ్‌తో ఇది ప్రారంభమైంది. ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్నిచ్చింది. అంతకుమించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతుకున్న ఓ సమూహం తాలూకు నమ్మకం.. అలిసిపోని ఆశయానికి ఊపిరిపోసేవాడు ఒకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాలపాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా చేస్తాడని గొప్పగా ఎదురుచూస్తోంది అంటూ వృద్ధుడు వివరిస్తారు. దీనికి మెగాస్టార్ చిరును చూపిస్తూ.. విలన్లను చిత్తు చేస్తున్నట్లు యాక్షన్ సీన్స్ జత చేశారు. ఈ గ్లింప్స్ చూసిన అభిమానుల అంచనాలు రెట్టింపు అయ్యాయి. గూస్ బంప్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
'విశ్వంభర’ మూవీ 'చందమామ కథలు' గుర్తు చేసే అందమైన కథగా వర్ణించారు చిరంజీవి. పిల్లలతో పాటు, లోపల ఇంకా చిన్నపిల్లలా ఉన్న పెద్దవారిని కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ సినిమా సెకండ్‌హాఫ్ మొత్తం వీఎఫ్‌ఎక్స్ మీద ఆధారపడి ఉంది. దీన్ని అత్యుత్తమంగా మీకు అందించాలనే ప్రయత్నమే ఈ మూవీ జాప్యానికి ప్రధాన కారణం. ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని చిరంజీవి తెలిపారు.
ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో UV క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ లో చిరంజీవి సరసన త్రిషా కృష్ణన్ నటించారు. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలో కనించనున్నాను. మౌనీ రాయ్ ఓ ప్రత్యేక గీతం డ్యాన్స్ చేశారు. సంగీతం ఎం ఎం కీరవాణి అందించగా.. సినిమాటోగ్రఫీ బాధ్యతలను చోటా కె నాయుడు చేపట్టారు.
ఈ స్పెషల్ గ్లింప్స్ విడుదలతో మెగా అభిమానులు పుట్టినరోజు వేడుకలను మరింత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ‘విశ్వంభర’ తెలుగు సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలవబోతోందన్న అభిమానులు అంచనాలు వేస్తున్నారు.