
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన రైళ్లను పలు స్టేషన్లకు మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 26 తేదీ వరకు దాదాపు 30 రైళ్లు హైదరాబాద్లోని పలు రైల్వే స్టేషన్ల నుంచి బయల్దేరతాయి. సికింద్రాబాద్ -పోర్ బందర్ సర్వీసును ఉందానగర్ నుంచి, సిద్దిపేట్ -సికింద్రాబాద్ సర్వీస్ను మల్కాజ్ గిరి నుంచి, పుణె-సికింద్రాబాద్ సర్వీస్ను హైదరాబాద్ స్టేషన్ నుంచి.. వీటితో పాటు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లను చర్లపల్లికి మార్చారు. సికింద్రాబాద్ నుంచి మల్కా్జ్ గిరి, ఉందా నగర్, చర్లపల్లికి తాత్కాలికంగా షిఫ్ట్ చేశారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతున్న దాదాపు 30 ట్రైన్స్ హైదరాబాద్లోని ఇతర రైల్వే స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చర్లపల్లి స్టేషన్కు మార్చిన రైళ్ల వివరాలు:
* సికింద్రాబాద్-రేపల్లె
* సికింద్రాబాద్-మణుగూరు
* సికింద్రాబాద్-రామేశ్వరం
* సికింద్రాబాద్-సిల్చార్
* సికింద్రాబాద్-ముజఫర్‌పూర్
* సికింద్రాబాద్-సంత్రగచ్చి
* సికింద్రాబాద్-దానాపూర్
* సికింద్రాబాద్-దర్భంగా
* సికింద్రాబాద్-యశ్వంత్ పూర్
* సికింద్రాబాద్-అగర్తలా
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రోజుకు దాదాపు 80 ఎక్స్‌ప్రెస్, మరో 100 ప్యాసింజర్ రైళ్లు వచ్చి పోతుంటాయి. ఈ రైల్వేస్టేషన్నుంచి రోజుకు 2 నుంచి 3లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రోజుకు దాదాపు 3.5లక్షల మంది వరకు వచ్చి పోతుంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.720 కోట్లతో రైల్వే శాఖ ఆధునీకరిస్తున్నది. రైల్వే స్టేషన్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు రానున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికులకు రద్దీకి ఇబ్బందుల్లేకుండా స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మాదిరిగా రూపుదిద్దనున్నట్టు అధికారులు తెలిపారు.
స్టేషన్ లోపల షాపులు, ఫుడ్ కోర్టులు, విశ్రాంతి కేంద్రాలు, వెయిటింగ్ హాల్స్, ఆధునిక టికెట్ కౌంటర్లు నిర్మిస్తున్నారు. స్టేషన్‌ను జీ+3 అంతస్తులుగా నిర్మించనున్నారు. ఒక ఐకానిక్ స్ట్రక్చర్‌గా దీనిని నిర్మిస్తున్నారు. స్టేషన్‌కు రెండు వైపులా రెండు ట్రావెలర్లతో పాటు రెండు నడక మార్గాలను నిర్మిస్తున్నారు. లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, విశాలమైన రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. స్టేషన్‌కు ఈస్ట్ వైపు ఒకస్కైవేను మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేస్తున్నారు.