దిగజారిన ఓయూ ర్యాంక్.. జాతీయ స్థాయిలో 64వ స్థానం

దిగజారిన ఓయూ ర్యాంక్..  జాతీయ స్థాయిలో 64వ స్థానం
  • దిగజారిన ఓయూ ర్యాంక్
  • జాతీయ స్థాయిలో 64వ స్థానం
  • నిరుటితో పోలిస్తే 18 స్థానాలు కిందికి 
  • 14వ ర్యాంకులో ఐఐటీహెచ్, 20వ స్థానంలో హెచ్​సీయూ 
  • ఇంజినీరింగ్ కేటగిరీలో 83వ స్థానానికి పడిపోయిన జేఎన్టీయూ
  • ఫార్మసీలో నిరుడు కేయూ ర్యాంక్ 44.. ఈ ఏడాది 82వ స్థానం

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని గవర్నమెంట్ కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. రాష్ట్రానికే తలమానికంగా నిలిచే ఉస్మానియా యూనివర్సిటీలోనూ మెరుగైన విద్య అందడం లేదు. నేషనల్ ఇన్​స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌‌వర్క్‌‌ (ఎన్ఐఆర్​ఎఫ్) కింద కేంద్ర ఉన్నత విద్యాశాఖ ఈ ఏడాదికి సంబంధించి విడుదల చేసిన ర్యాంకుల్లో ఓయూ 64వ స్థానానికి పడిపోయింది. నిరుటితో పోలిస్తే 18 స్థానాలు దిగజారింది. ఓవరాల్ కేటగిరిలో టాప్ 100లో తెలంగాణ నుంచి నాలుగు విద్యా సంస్థలే చోటు దక్కించుకున్నాయి. ఐఐటీహెచ్ 14వ స్థానంలో, హెచ్​సీయూ 20వ స్థానంలో నిలిచాయి. నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ 53, ఉస్మానియా యూనివర్సిటీ 64 స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వం సరిపడా నిధులివ్వకపోవడంతో పాటు ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతున్నదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

దేశంలోనే టాప్​లో మద్రాస్ ఐఐటీ

దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ నిలిచింది. తర్వాతి స్థానంలో బెంగళూరు ఐఐటీ, ఢిల్లీ ఐఐటీ, బాంబే ఐఐటీ, కాన్పూర్ ఐఐటీ, ఢిల్లీ ఎయిమ్స్, ఖరగ్​పూర్ ​ఐఐటీ, రూర్కీ ఐఐటీ, గువాహటి ఐఐటీ, జవహర్​లాల్ నెహ్రూ యూనివర్సిటీలు నిలిచాయి. యూనివర్సిటీ కేటగిరీలో ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ఫస్ట్ ప్లేస్​లో నిలిచింది. అదేవిధంగా, ఇంజినీరింగ్ కేటగిరీలో మద్రాస్ ఐఐటీ టాప్​లో ఉంది. కాలేజీల కేటగిరీలో ఢిల్లీకి చెందిన మిరాంద హౌస్ నంబర్ వన్ ప్లేస్​లో ఉంది. మేనేజ్​మెంట్ కేటగిరీపరంగా ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు ఫస్ట్, సెకండ్ ప్లేస్​లో నిలిచాయి. మెడికల్ కాలేజ్ కేటగిరిలో ఢిల్లీ ఎయిమ్స్ ఫస్ట్ ప్లేస్​లో ఉంది. డెంటల్ కాలేజ్ కేటగిరిలో చెన్నైకి చెందిన సవిత ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ టాప్​లో నిలిచింది. లా కేటగిరీలో బెంగళూరులోని నేషనల్‌‌ లా స్కూల్‌‌ ఆఫ్‌‌ ఇండియా యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్​లో ఉంది. టీచింగ్, లెర్నింగ్, రీసోర్సెస్, రీసెర్చ్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ ఔట్​కమ్స్, అడ్మిషన్స్ వంటి అంశాల ఆధారంగా 13 కేటగిరీల్లో ర్యాంకులు ప్రకటించారు.

పడిపోయిన స్టేట్ వర్సిటీ ప్రమాణాలు

ర్యాంకుల పరంగా ఓయూ, కేయూ, జేఎన్టీయూ కింద పడిపోయాయి. ఓవరాల్ కేటగిరీలో టాప్ వందలో స్టేట్ వర్సిటీ ఓయూ మాత్రమే ఉంది. గతేడాది ఓయూ 46వ ర్యాంకు పొందగా, ఈసారి 64కు దిగజారింది. స్కోర్ కూడా తగ్గింది. యూనివర్సిటీ కేటగిరీలో లాస్టియర్ ఓయూ 22వ స్థానంలో ఉంటే, ఈఏడాది 36వ స్థానానికి పడిపోయింది. హెచ్​సీయూ పదో స్థానంలో నిలవగా, ఐఐటీహెచ్ 84వ స్థానంలో నిలిచింది. కాలేజ్ లెవెల్​లో తెలంగాణ నుంచి ఒక్క గవర్నమెంట్ కాలేజీ లేదు. కేవలం సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీ 98వ ర్యాంకు పొందింది. 

టాప్​100లో కనిపించని ఇంజినీరింగ్ కాలేజీలు

ఇంజినీరింగ్ కేటగిరీలో నిరుడు జేఎన్టీయూహెచ్ 76వ స్థానంలో ఉంటే, ఈ ఏడాది 83కు దిగజారింది. టాప్ 100లో కూడా ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ కనిపించలేదు. ఫార్మసీ కేటగిరీలో స్టేట్ వర్సిటీ కాకతీయలో భారీగా ప్రమాణాలు పడిపోయాయి. గతేడాది 44వ ర్యాంకు పొందితే, ఈసారి ఏకంగా 82కు పడిపోయింది. అయితే, ఈ కేటగిరీలో నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్​ (నైపర్) దేశంలోనే టాప్​లో నిలిచింది. నిరుడు రెండోస్థానంలో నిలవగా, ఈఏడాది ఫస్ట్​ ప్లేస్​కి చేరింది. 

మెడికల్ కేటగిరీలో కాలేజీల్లేవు

మెడికల్ కేటగిరీలో ఒక్క కాలేజీ లేదు. డెంటల్ కేటగిరిలో ఆర్మీ డెంటల్ కాలేజీ, సికింద్రాబాద్ 33వ స్థానంలో నిలిచింది. అగ్రికల్చర్, దాని అనుబంధ సెక్టార్ కేటగిరీలో  నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ మేనేజ్​మెంట్ 32వ ర్యాంకు సాధించింది. లా కేటగిరీలో నల్సార్ లా యూనివర్సిటీ మూడో స్థానంలో నిలవగా, ఇన్నోవేషన్ కేటగిరీలో ఐఐటీహెచ్ థర్డ్ ప్లేస్​లో నిలిచింది. హెచ్​సీయూ, ఐఐటీహెచ్ సంస్థలు వివిధ కేటగిరీలో మంచి ర్యాంకులు పొందాయి.