పర్యాటక కేంద్రంగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ

పర్యాటక కేంద్రంగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ
  • కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 2 కోట్ల నిధులు విడుదల
  • లేజర్ లైటింగ్​ షో, గార్డెనింగ్ కు ముమ్మర ఏర్పాట్లు
  • వర్సిటీ చరిత్ర తెలుసుకునేలా ప్రదర్శన

ఓయూ,వెలుగు : రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలు, కట్టడాలకు సరికొత్త శోభ సంతరించేలా.. వాటి  ప్రాముఖ్యతను వివరించేలా సౌండ్ షో, లైట్​షో ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ ప్రత్యేక నిధులను విడుదల చేసి అభివృద్ధి పనులను ప్రారంభించింది. పర్యాటకులను ఆకర్శించడమే లక్ష్యంగా రూ.2 కోట్ల నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర నిధులతో పాటు ఓయూ రూ.3 కోట్ల అంతర్గత నిధులతో  ఆర్ట్స్​ కాలేజీ రూఫ్​, గోడలు, ఇతర మరమ్మతు పనులను మూడు నెలలుగా కొనసాగిస్తున్నారు. ఆర్ట్స్​కాలేజీ ఎదుట వాటర్​ ఫౌంటన్​కు ఇరువైపులా భారీ సౌండ్​ సిస్టమ్​, లైటింగ్​, పెద్ద లేజర్​ లైటింగ్ సిస్టమ్​ను ఏర్పాటు చేశారు. కాలేజీ ఆవరణలో పచ్చదనం మరింత పెంపొందేలా గార్డెన్​ను కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. 

లేజర్ లైట్ షో కోసం ఇప్పటికే ట్రయల్స్​నిర్వహించారు. వర్సిటీ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలు, వందేమాతరం ఉద్యమంలో ఓయూ విద్యార్థులు పోషించిన కీలక పాత్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తొలి, మలి దశ ఉద్యమాలు, స్వాతంత్ర్య సమరయోధులు, స్వాతంత్ర్య పోరాటంలో వారిపాత్ర.. ఇలాంటి అనేక అంశాలతో ఈ లైట్​షోలో ప్రదర్శనలు ఉండనున్నాయి. 104 ఏళ్ల వర్సిటీ చరిత్రను పర్యాటకులు, విద్యార్థులు, ఉద్యోగులకు కళ్లకు కట్టినట్టుగా త్రీ-డీ యానిమేషన్​లో ప్రదర్శించనున్నారు.  ఇందుకు ప్రొఫెసర్లతో వర్సిటీ అధికారులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ పలు కార్యక్రమాలను  పర్యవేక్షిస్తోంది. లైట్​షో తోపాటు బ్యాగ్​ గ్రౌండ్​మ్యూజిక్​ ద్వారా ఓయూ చరిత్రను వివరించేలా ప్రదర్శన ఉండనుందని వర్సిటీ అధికారులు తెలిపారు.