మమ్మల్నీ రెగ్యులరైజ్​ చేయండి.. ఓయూలో కాంట్రాక్ట్​ ఉద్యోగులు ర్యాలీ

మమ్మల్నీ రెగ్యులరైజ్​ చేయండి.. ఓయూలో కాంట్రాక్ట్​ ఉద్యోగులు ర్యాలీ

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఓయూ పరిపాలన భవనం నుండి ఆర్ట్స్ కళాశాల వరకు అసిస్టెంట్​ ప్రొఫెసర్లు ర్యాలీ చేశారు. తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్​ పద్దతిపై పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్దీకరించాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ అధ్యాపకులను క్రమబద్దీకరిస్తామని 2016లో సీఎం కేసీఆర్​ ప్రభుత్వం జీవో 16 విడుదల చేసినా.. ఇప్పటివరకు అమలు కాలేదని ఓయూ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్ అధ్యక్షుడు పరశురాం ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్ల​ సర్వీస్​లను క్రమబద్దీకరించి.. విశ్వవిద్యాలయాల్లో పని చేసేవారిని విస్మరించిందని పరశురాం ఆందోళన వ్యక్తం చేశారు. యూజీసీ, ఏఐసీటిఈ నిబంధనల ప్రకారం..వారికి ఏ విధమైన అర్హతలు ఉన్నాయో.. తమకు కూడా అవే అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర  ప్రభుత్వం తమను పట్టించుకోకపోతే అన్ని యూనివర్శిటీల  అసిస్టెంట్ ప్రొఫెసర్లతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.