ఘనంగా ఓయూ ఫౌండేషన్ డే

ఘనంగా ఓయూ ఫౌండేషన్ డే

 ఓయూ, వెలుగు : ‘ఉస్మానియా తక్ష్ 2024’ పేరుతో బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో  107వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందు ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి సెంటెనరీ పైలాన్ వరకు 2కే వాక్ నిర్వహించారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి వాక్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గురువారం వర్సిటీలోని అన్ని విభాగాల్లో ఓపెన్ హౌజ్ కార్యక్రమాలతోపాటు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

 28న ఉదయం 10.30 గంటలకు ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న వేడుకల్లో అతిథులుగా నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్ కుమార్ సారస్వత్, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, అమెరికాలోని ఇమేజియా కార్పొరేషన్ ఫౌండర్, సీఈఓ వీణ గుండవెళ్లి పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, సినీ గేయ రచయిత, కవి జయరాజు హాజరవుతారని చెప్పారు. వాక్​లో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, డెవలప్మెంట్ అండ్ యూజీసీ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జి.మల్లేశం, వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, డీన్లు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.

సివిల్స్ ర్యాంకర్లకు సన్మానం

తన తాత స్థాపించిన యూనివర్సిటీలో లక్షల మంది చదువుకొని, జీవితంలో స్థిరపడటం చాలా గర్వంగా ఉందని ఏడో నిజాం మనవడు నవాబ్ మీర్ నజఫ్ అలీఖాన్ చెప్పారు. ఫౌండేషన్ డే వేడుకల్లో భాగంగా బుధవారం ఇటీవల విడుదలైన సివిల్స్​ఫలితాల్లో 82వ ర్యాంకు సాధించిన కౌశిక్, 545 ర్యాంక్​ సాధించిన నరేంద్రను, డిగ్రీ, జూనియర్​లెక్చరర్​ఉద్యోగాలు సాధించిన ఓయూ స్టూడెంట్లను ఘనంగా సత్కరించారు. ఓయ్ ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నవాబ్ మీర్ నజఫ్ అలీఖాన్ పాల్గొని మాట్లాడారు.

 లక్షలాది స్టూడెంట్లు ఓయూలో ఉన్నత విద్య పూర్తిచేసి ప్రపంచ నలుమూలల సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. మధ్య ప్రదేశ్ మాజీ డీజీపీ మరియ కుమార్ మాట్లాడుతూ.. తానూ ఓయూ స్టూడెంట్​నేనని, 1983-–85లో ఎంఏ ఫిలాసఫీ చేశానని గుర్తుచేశారు. వందేళ్ల కింద నిజాం ముందుచూపుతో ఓయూను స్థాపించారని కొనియాడారు. 

అనంతరం ఆర్ట్స్ కాలేజీ భవన అర్కిటెక్ట్ ఎర్నెస్ట్ జాస్పర్ ఫొటోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్టీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కుతాడి అర్జున్ రావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ బీనవేణి షెఫర్డ్, ప్రొఫెసర్ కాశిం, డాక్టర్ కొండా నాగేశ్వర్ 
తదితరులు పాల్గొన్నారు.