
భారత రాజ్యాంగ పితామహుడు బీఆర్ అంబేద్కర్‌కు హైదరాబాద్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 1953లో ఉస్మానియా విశ్వవిద్యాలయం అంబేద్కర్ కు తొలి డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించింది. దేశంలోనే తొలిసారిగా అంబేద్కర్ కు ఓయూ గౌరవ డాక్టరేట్ అందజేసి, సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించింది. మొత్తం నాలుగు సార్లు అంబేద్కర్ హైదరాబాద్ కు వచ్చారు. ఆయన హైదరాబాద్ కు వచ్చిన ప్రతిసారి సికింద్రాబాద్ పెండర్ ఘాస్ట్ రోడ్డులోని జేహెచ్ సుబ్బయ్య ఇంట్లో బస చేసే వారు. నిజాం రాజు తన కాలంలో అంబేద్కర్ బోధనలు, ఆలోచనలకు చాలా ప్రభావితమయ్యారు.
రెండో రౌండ్ టేబుల్ మీటింగ్‌లో అంబేద్కర్ పాల్గొనేందుకు లండన్ ప్రయాణ, వసతి ఖర్చులను కూడా నిజాం సర్కారే భరించింది. హైదరాబాద్ గడ్డ మీద 1932 సెప్టెంబర్ 3వ తేదీన తొలిసారిగా అంబేద్కర్ అడుగుపెట్టారు. 1936 మే 30న లీగ్ రెండో సదస్సులో పాల్గొనేందుకు అంబేద్కర్ మరో సారి హైదరాబాద్ వచ్చారు . హైదరాబాద్ దళిత త్రయంగా పిలిచే అరిగె రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, బీఎస్ వెంకట్రావుతోనూ అంబేద్కర్‌కు స్నేహ సంబంధాలున్నాయి. నిజానికి వెంకట్ రావుని అప్పట్లో హైదరాబాద్ అంబేద్కర్ అని పిలిచేవారు.
హైదరాబాద్‌లో దళిత ఉద్యమ ప్రాముఖ్యతను గుర్తించి, అంబేద్కర్ 1936లో బొంబాయి ప్రెసిడెన్సీ మహర్ సభకు అధ్యక్షత వహించాలని వెంకటరావును ఆహ్వానించారు. అంబేద్కర్ కూడా 1934లో వాటర్ ట్యాంక్ నుండి నీరు తీసుకునే హక్కు కోసం పోరాడుతున్న దళితులకు అండగా నిలిచేందుకు హైదరాబాద్ వచ్చారు.