
- వివేక్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటం: ఓయూ జేఏసీ
సికింద్రాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఓటమే లక్ష్యంగా చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తామని ఓయూ జేఏసీ లీడర్లు ప్రకటించారు. అదే క్రమంలో, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని భారీ మెజార్టీతో గెలిపించే దిశగా కృషి చేస్తామని అన్నారు. మంగళవారం ఓయూ జేఏసీ లీడర్లు ఆర్ట్స్ కాలేజ్ వద్ద మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో బాల్క సుమన్ తరఫున ప్రచారం చేసి గెలిపించామన్నారు.
ఆ తర్వాత బాల్క సుమన్‌తో పాటు సీఎం కేసీఆర్ స్టూడెంట్స్ గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. వారిని మోసం చేసి జీవితాలతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు రాక ఎంతో మంది యువకులు రోడ్డున పడ్డారన్నారు. అందుకే, ఈసారి బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా చెన్నూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తామని ప్రకటించారు. ప్రతి మండలానికి, గ్రామానికి వెళ్లి స్టూడెంట్ల జీవితాలు ఎలా రోడ్డున పడ్డాయో వివరిస్తామన్నారు.
నిరుద్యోగులకు చేసిన అన్యాయం గురించి కూడా తెలియజేస్తామని చెప్పారు. బాల్క సుమన్, బీఆర్ఎస్ సర్కార్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామి తరఫున ప్రచారం చేయడానికి బయల్దేరుతున్నట్లు తెలిపారు. ఓయూ గడ్డ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన బాల్క సుమన్.. ఓయూ స్టూడెంట్స్ కు అండగా నిలువకపోగా.. వారికే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సుమన్‌ను ఓడించడం, వివేక్‌ను గెలిపించడమే తమ ఏకైక లక్ష్యమన్నారు.