ఒకే తేదీల్లో హైకోర్టు, ఓయూ ‘లా’ ఎగ్జామ్స్

ఒకే తేదీల్లో హైకోర్టు, ఓయూ ‘లా’ ఎగ్జామ్స్
  • యూజీసీ నెట్ ఎగ్జామ్స్ సైతం ఇవే తేదీల్లో నిర్వహణ
  • పరీక్షల క్లాష్‌‌తో విద్యార్థులు, నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన
  • లా సెమిస్టర్ తేదీలు మార్చాలని ఓయూ రిజిస్ట్రార్‌‌కు విద్యార్థుల వినతి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉస్మానియా లా సెమిస్టర్ ఎగ్జామ్స్​, తెలంగాణ హైకోర్టు ఉద్యోగాల రిక్రూట్‌‌మెంట్‌‌ పరీక్షలు, యూజీసీ నెట్ ఎగ్జామ్స్ ఒకే సమయంలో వస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్, జులై నెలల్లో ఓయూ ఎల్ఎల్‌‌బీ, ఎల్‌‌ఎల్‌‌బీ హానర్స్ సెమిస్టర్ పరీక్షలు, యూజీసీ-నెట్, హైకోర్టు రిక్రూట్‌‌మెంట్ పరీక్షలు ఒకే తేదీల్లో వస్తున్నాయి. కంప్యూటర్ ఆధారిత యూజీసీ-నెట్ పరీక్షలు ఈనెల 22 నుంచి 30 వరకు జరగనున్నాయి.

ఈ పరీక్షకు సంబంధించిన 'సిటీ ఇంటిమేషన్ స్లిప్' ఈనెల 10న విడుదల కాగా, 'అడ్మిట్ కార్డులు' ఈ నెల15న విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, హైకోర్టులో భర్తీ చేయనున్న ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్, కాపీయిస్ట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ వంటి మొత్తం 859 వివిధ పోస్టుల రాత పరీక్షలు ఈనెల 24 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. వీటి హాల్ టికెట్లు ఈనెల 17 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఇదే నోటిఫికేషన్‌‌ పరిధిలోని సివిల్ జడ్జి మెయిన్స్ పరీక్షలు ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్నారు. కీలకమైన ఈ పరీక్షల కోసం విద్యార్థులు వేల రూపాయలు వెచ్చించి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒకే రోజు పరీక్షలు రావడం వల్ల ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సి వస్తోందని, కోచింగ్ ఫీజులు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. సెమిస్టర్ పరీక్షకు అబ్సెంట్ అయితే ఫెయిల్ అయినట్లు పరిగణిస్తారని, బ్యాక్‌‌లాగ్ వల్ల విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓయూ పరీక్షలు హైదరాబాద్‌‌లో ఉంటే, హైకోర్టు ఆన్‌‌లైన్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ఉదయం వరంగల్‌‌, నిజామాబాద్‌‌లలో హైకోర్టు పరీక్ష రాసి, మధ్యాహ్నానికి హైదరాబాద్ వచ్చి లా పరీక్ష రాయడం అసాధ్యం.

లా ఎగ్జామ్స్​తేదీలు మార్చాలని విద్యార్థుల డిమాండ్​..

జాతీయ, రాష్ట్ర స్థాయి రిక్రూట్‌‌మెంట్‌‌ పరీక్షల తేదీలను మార్చడం సాధ్యం కాదు కాబట్టి, ఓయూ లా సెమిస్టర్ పరీక్షల తేదీలను మార్చాలని విద్యార్థి ప్రతినిధులు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన రిజిస్ట్రార్ ఈ విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

పరీక్షల క్లాష్ ఇలా..

ఈనెల 18, 20 తేదీల్లో: ఓయూ లో ‘లా ఆఫ్ టాక్సేషన్’, ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లా’ పరీక్షల సమయంలోనే యూజీసీ నెట్ పరీక్షలు ఉన్నాయి. 
-ఈనెల 20, 21 తేదీల్లో: జూన్ 20న ఓయూ లా ఫోర్త్ సెమిస్టర్ పరీక్ష ఉండగా, అదే సమయంలో సివిల్ జడ్జ్ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. 
-ఈనెల 24 నుంచి 28 వరకు: హైకోర్టు జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పరీక్షలు ఉండగా.. ఓయూ టైమ్ టేబుల్ ప్రకారం ఈనెల 24న ఫోర్త్ సెమిస్టర్ (సీఆర్‌‌‌‌పీసీ), 25న సెకండ్ సెమిస్టర్ (ఫ్యామిలీ లా 2), 27న ఫోర్త్ సెమిస్టర్ (పబ్లిక్ ఇంటర్నేషనల్ లా) పరీక్షలు ఉన్నాయి.