పేద స్టూడెంట్లకు శాపంగా ఓయూ కొత్త రూల్

V6 Velugu Posted on Dec 04, 2021

  • మెరిట్​ ఉన్న పేద స్టూడెంట్లు నష్టపోయే అవకాశం
  • అబ్బాయిలకు 140, అమ్మాయిలకు 35 సీట్లే కేటాయింపు
  • ఇయ్యాల్టితో హాస్టల్​ అడ్మిషన్​ గడువు పూర్తి 

ఓయూ, వెలుగు: రీఫార్మ్స్​ పేరుతో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తీసుకొచ్చిన కొత్త రూల్స్​.. పేద స్టూడెంట్లకు శాపంగా మారుతున్నాయి. వర్సిటీకి 60 కిలోమీటర్ల లోపు నివాసముండే స్టూడెంట్లకు హాస్టల్​ సౌలతులు కల్పించబోమని పేర్కొంటూ ఓయూలో కొత్త రూల్స్​ తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఉత్తర్వులనూ జారీ చేశారు. పీజీఈసెట్​లో ఇంజనీరింగ్​ పీజీ (ఎమ్​ఈ)  సీట్లు పొందిన స్టూడెంట్లు హాస్టల్​కు అప్లై చేసుకోవడానికి డిసెంబర్​ 4 వరకు గడువిచ్చారు. అయితే, 60 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉండేవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటూ షరతు పెట్టారు. దీంతో క్యాంపస్​కు 60 కిలోమీటర్ల లోపు ఉండి మెరిట్​ కలిగిన పేద, మధ్య తరగతి స్టూడెంట్లకు హాస్టల్​ దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. గడువు పూర్తి కావొస్తుండడంతో వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు. ఈ రూల్​తో సరైన రవాణా సౌలతులు లేని  ప్రాంతాల్లో ఉండే పేద మెరిట్​ స్టూడెంట్లు కాలేజీకి వచ్చి ఎలా చదువుకుంటారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ రూల్​ను మార్చి అడ్మిషన్లను ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. 

అతి కొద్ది మందికే హాస్టల్
ఓయూ క్యాంపస్​లో వెయ్యికి పైగా ఎమ్​ఈ​ సీట్లున్నాయి. అయితే, హాస్టల్​ అడ్మిషన్​ మాత్రం అతికొద్ది మందికే ఇస్తున్నారు. అబ్బాయిలకు 140 సీట్లనే అలాట్​ చేశారు. అమ్మాయిలకైతే మరీ తక్కువగా ఇస్తున్నారు. కేవలం 30 నుంచి 35 మందికే హాస్టల్​ వసతి కల్పిస్తున్నారు. 60 కిలోమీటర్ల కన్నా లోపున్నవాళ్లు అప్లై చేసుకున్నా అడ్మిషన్​ ఇవ్వబోమని కరాఖండిగా చెప్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే రూములు తక్కువున్నయని అధికారులు చెప్తున్నారు. అమ్మాయిలకైతే బీఈ స్టూడెంట్లకు కేటాయించిన హాస్టళ్లలోనే నాలుగైదు రూముల్లో అడ్మిషన్​ ఇస్తున్నారు. నిజానికి ఈ రూల్​ను నిరుడు అప్పటి ఇంజనీరింగ్​ కాలేజ్​ ప్రిన్సిపాల్​గా ఉన్న ప్రొఫెసర్​ కుమార్​ తీసుకొచ్చారు. అప్పుడు కరోనా ఉండడంతో కేవలం ఆన్​లైన్​ క్లాసులే నడిచాయి. దీంతో హాస్టల్​ సమస్య రాలేదు. ఇప్పుడు ఫిజికల్​ క్లాసులు నడుస్తుండడంతో హాస్టల్​ సమస్య తెరపైకి వచ్చింది. ఈ రూల్​ పెట్టిన ప్రొఫెసర్​ కుమార్​ కూడా నగర శివార్ల నుంచే వచ్చి ఓయూ హాస్టల్​లో ఉండి ఇంజనీరింగ్​ పూర్తి చేశారని, ఊర్లల్లో ఉండే స్టూడెంట్లకు ఎదురయ్యే సమస్యలు తెలిసి కూడా ఇలాంటి రూల్​ను ఎలా తీసుకొచ్చారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. 

రూములు తక్కువున్నయ్
ఎమ్​ఈ స్టూడెంట్ల కోసం ఒకటే హాస్టల్​ ఉంది. అందులో ఎప్పుడూ 140 మందికి అడ్మిషన్లు ఇస్తున్నం. హాస్టల్​లో ఉన్న గదులు చాలా తక్కువ. అడ్మిషన్లకు మాత్రం చాలా మంది అప్లై చేసుకున్నరు. ముందుగా దూర ప్రాంతాల స్టూడెంట్లకు అడ్మిషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే 60 కిలోమీటర్ల రూల్​ను పెట్టినం. దూరం నుంచే వచ్చేటోళ్లకు హాస్టల్​ అడ్మిషన్లు ఇచ్చాక.. మిగిలిన సీట్లలో మిగతా వాళ్లకూ అడ్మిషన్​ ఇస్తం.  
- ప్రొఫెసర్​ మంగూ నాయక్​, ఓయూ ఇంజనీరింగ్​ కాలేజ్​ హాస్టల్​ అడిషనల్​ చీఫ్​ వార్డెన్​

అప్లికేషన్​ కూడా తీసుకోవట్లేదు
మాది భువనగిరి దగ్గర గ్రామం. ఓయూలో ఎమ్​ఈ సీటు వచ్చింది. హాస్టల్​​అడ్మిషన్​ కోసం వెళ్తే.. ‘మీ ఊరు ఓయూకు 60 కిలోమీటర్ల లోపే ఉంది’​ అని చెప్పి హాస్టల్​ సౌలతు ఇవ్వట్లేదు. కనీసం అప్లికేషన్​ కూడా తీసుకోవట్లేదు. బాగా చదువుకోవాలనే ఆశతో ఓయూలో చేరిన. తీరా హాస్టల్​​ఇవ్వకుంటే ఇంటి నుంచి ఎలా వచ్చేది? ఎలా కోర్సు పూర్తి చేసేది? 
- రాజేందర్​, యాదాద్రి భువనగిరి జిల్లా 

Tagged Hyderabad, students, Osmania University, hostel, reforms rule

Latest Videos

Subscribe Now

More News