ఉరితాడుకు వేలాడుతున్న వ్యక్తిని నిమిషాల్లో కాపాడిన ఓయూ పోలీసులు

ఉరితాడుకు వేలాడుతున్న వ్యక్తిని నిమిషాల్లో కాపాడిన ఓయూ పోలీసులు

ఉప్పల్, వెలుగు: ఎమర్జెన్సీ కాల్‌ అందడమే ఆలస్యం నిమిషాల్లో స్పందించి, ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పోలీసులు సురక్షితంగా కాపాడారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మల్లేశ్ అనే వ్యక్తి ఉరి వేసుకుంటున్నాడంటూ ఆదివారం రాత్రి డయల్-100కు సమాచారం వచ్చింది. వెంటనే ఓయూ ఇన్​స్పెక్టర్ మహేశ్ అప్రమత్తమై బ్లూ కోల్ట్స్-3 సిబ్బంది, కానిస్టేబుళ్లు విజయ్ కుమార్ నాయక్, తిరుపతిని రంగంలోకి దించారు. 

వారు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మణికేశ్వరనగర్​లోని బాధితుడి ఇంటిని నిమిషాల్లో గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికే మల్లేశ్ ఉరితాడుకు వేలాడుతుండటంతో, వెంటనే లోపలికి వెళ్లి అతడిని కిందికి దించి ప్రాణాలు కాపాడారు. అనంతరం బాధితుడికి పోలీస్ స్టేషన్​లో కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.