బాల్క సుమన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి : ఓయూ విద్యార్థి జేఏసీ ఫిర్యాదు

బాల్క సుమన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి : ఓయూ విద్యార్థి జేఏసీ ఫిర్యాదు

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ విద్యార్థులపై స్థానిక పోలీసులు ప్రవర్తించిన తీరుపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు అందింది. అధికార పార్టీ ఎమ్మెల్యే (బాల్క సుమన్​)కు పోలీసులు అనుకూలంగా పని చేస్తున్నారని ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ జటంగి సురేష్ యాదవ్ తమ ఫిర్యాదులో వివరించారు. చెన్నూరులో ప్రచారానికి వెళ్లిన తమను పోలీసులు ఆపి.. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు కావాలంటూ చాలా ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. అక్కడ ఉండే పోలీసులు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు అనుకూలంగా వ్యహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కేసులు పెడుతామని పోలీసులు బెదిరించారని చెప్పారు. కొంతమంది బాల్క సుమన్ అనుచరులు తమపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మరికొందరు విపరీతంగా యువకులకు మద్యం పంచి పెడుతూ.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని తెలిపారు. చెన్నూరులో జరుగుతున్న వాటిపై వెంటనే విచారణ చేపట్టి.. డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్న బాల్క సుమన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరారు. దాంతో పాటు ప్రచారానికి వెళ్లిన ఓయూ విద్యార్థులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.