
- జాబ్‌క్యాలెండర్‌పై ఓయూ విద్యార్థి జేఏసీ హర్షం
- 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లింపు
సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 20 ఏండ్లు కాంగ్రెస్‌పార్టీనే అధికారంలో ఉండాలని.. రేవంతే సీఎంగా కొనసాగాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు ఓరుగంటి కృష్ణ అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో జాబ్ క్యాలెండర్విడుదల చేయడం హర్షణీయమన్నారు. శనివారం ఆయన ఓయూ ఆర్ట్స్ కాలేజీ సమీపంలోని సరస్వతి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్అధికారంలోకి వచ్చి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఓయూ క్యాంపస్‌లోని సరస్వతీదేవి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను.
నా కోరిక నెరవేరింది. అందుకే 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నా. నీళ్లు, నియామకాలు, నిధులు పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పదేండ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది. ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పారదర్శకంగా జరుగుతాయి. ఒక్కో శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో జాబ్ క్యాలెండర్ ద్వారా తెలిస్తుంది’ అని ఓరుగంటి కృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు అంబేద్కర్, నాగేశ్‌నాయక్, సత్తి నర్సింహ, అంజి, సింహాద్రి, శ్రీవాస్ తదితరులు పాల్గొన్నారు.