ఓయూలో రాహుల్ సభకు అనుమతి నిరాకరణ

ఓయూలో రాహుల్ సభకు అనుమతి నిరాకరణ

ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనకు వైస్ ఛాన్స్లర్ అనుమతి నిరాకరించారు. 2021 జూన్ 22న జరిగిన పాలక మండలి సమావేశంలో రాజకీయ, మతపరమైన సభలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారని, అందుకు రాహుల్ సభకు పర్మిషన్ ఇవ్వలేమని చెప్పారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఓ లేఖ రాశారు. ఓయూలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, టెక్నికల్ స్టాఫ్ ఎంప్లాయిస్, ఓయూ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికలు మే 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 5గంటల వరకు జరగనున్నాయని రిజిస్ట్రార్ లేఖలో  ప్రస్తావించారు. ప్రస్తుతం ఎంబీఏ పరీక్షలు కొనసాగుతున్నాయని, మే 9 నుంచి పీజీ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నందున సభ వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశముందని అన్నారు. యూనివర్సిటీకి చెందిన ఇతర స్టూడెంట్ ఆర్గనైజేషన్లు సైతం రాహుల్ పర్యటనపై అభ్యంతరాలు లేవనెత్తాయని, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశమున్నందున రాహుల్ పర్యటనకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. మే 7న ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో రాహుల్ గాంధీ సభకు అనుమతివ్వాలంటూ ఎన్ఎస్యూఐ సభ్యులైన మానవతా రాయ్, ప్రతాప్ రెడ్డి, జగన్నాథ్ యాదవ్, సూర చందన వీసీకి వినతిపత్రం ఇచ్చారు.