టెర్రరిజాన్ని రాజకీయ అవసరాల కోసం వాడొద్దు 

టెర్రరిజాన్ని రాజకీయ అవసరాల కోసం వాడొద్దు 

న్యూయార్క్: టెర్రరిస్టుల్లో మంచోళ్లు, చెడ్డోళ్లు అంటూ ఉండరని.. అందరూ క్రిమినల్సే అని మనదేశం పేర్కొంది. రాజకీయ అవసరాల కోసం టెర్రరిస్టులను మంచోళ్లు, చెడ్డోళ్లు అంటూ విభజించడం మానెయ్యాలని సూచించింది. వారి మతం, సిద్ధాంతాల ఆధారంగా టెర్రరిస్టులను విభజించడం వల్ల టెర్రరిజంపై ప్రపంచం చేస్తున్న యుద్ధం బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్​కు మనదేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ నెల 14, 15 తేదీల్లో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అధ్యక్షతన రిఫామ్​డ్ మల్టీల్యాటరిజం, కౌంటర్ టెర్రరిజంపై సమావేశాలు నిర్వహించనుంది. ఈ క్రమంలో యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కు యూఎన్​లో ఇండియా శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ కాన్సెప్ట్ నోట్ రాశారు. సమావేశాలకు గైడెన్స్ గా అన్ని సభ్య దేశాలకు ఈ లేఖను పంపించాలని కోరారు. 

టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా నేరమే.. 

‘‘టెర్రరిజానికి దేశం, మతం, జాతితో సంబంధం లేదు. అది ఏ రూపంలో ఉన్నా నేరమే” అని రుచిరా కాంబోజ్ లేఖలో పేర్కొన్నారు. టెర్రర్ దాడులు ఎప్పుడు? ఎక్కడ? ఎవరు? చేశారనే దానితో సంబంధం లేదని.. టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించవద్దని అన్నారు. ‘‘2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్ లో జరిగిన టెర్రరిస్టుల దాడి.. కౌంటర్ టెర్రరిజం విషయంలో ప్రపంచ విధానాలను మార్చేసింది. ఆ తర్వాత లండన్, ముంబై, ప్యారిస్, పశ్చిమ ఆసియా, ఆఫ్రికాలో టెర్రర్ దాడులు జరిగాయి. ఈ దాడులతో టెర్రరిజం ముప్పు ప్రపంచవ్యాప్తంగా ఉందని.. ఒక ప్రాంతంలో జరిగే టెర్రర్ దాడులతో మరో ప్రాంతంలో భద్రత, శాంతిపై ప్రభావం ఉంటోందని తేలింది. టెర్రరిస్టులు, వాళ్ల సపోర్టర్లు, ఫైనాన్షియర్లు వేర్వేరు దేశాల్లో ఉంటూ కలిసి పని చేస్తున్నారు. టెర్రరిజాన్ని నిర్మూలించాలంటే యూఎన్ లోని అన్ని సభ్య దేశాలు కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది” అని రుచిరా పేర్కొన్నారు.