ఉక్రెయిన్​లో మన స్టూడెంట్లు గోసవడ్తున్నరు

ఉక్రెయిన్​లో మన స్టూడెంట్లు గోసవడ్తున్నరు
  • కొన్నిరోజులుగా హాస్టళ్లకే పరిమితం
  • బయటకు రావాలంటే భయం
  • కీవ్​ ఎయిర్ పోర్టులో చిక్కుకున్న తెలంగాణ బిడ్డలు సుమాంజలి, రమ్యశ్రీ, ఎన్.శ్రీనిధి, లిఖిత 
  • తమ బిడ్డలను క్షేమంగా రప్పించాలని పేరెంట్స్​ విజ్ఞప్తి

నెట్​వర్క్ / హైదరాబాద్​, వెలుగు: తాము ఉంటున్న ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక.. స్వదేశానికి తిరిగి వచ్చే పరిస్థితి లేక రాష్ట్రానికి చెందిన స్టూడెంట్లు ఉక్రెయిన్​లో బిక్కుబిక్కుమంటున్నారు. కొందరైతే తినడానికి తిండి కూడా లేదని, ఏం చేయాలో అర్థమైతలేదని ఆవేదన చెందుతున్నారు. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్లు దాదాపు మూడు వేల మంది వరకు ఉంటారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన వాళ్లు 1,200 మంది వరకు ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన స్టూడెంట్లలో చాలా మంది అక్కడి వివిధ యూనివర్సిటీల్లో మెడిసిన్​ చదువుతున్నవాళ్లే. 

ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లోని మెడికల్​ యూనివర్సిటీలోనే వెయ్యి మంది వరకు ఏపీ, తెలంగాణ స్టూడెంట్లు ఉన్నారు. రష్యా దాడుల కారణంగా అక్కడి ఎయిర్​పోర్టులు మూతపడ్డాయి. తాము ఇండియాకు వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్నామని, కానీ విమానాలు బంద్​ చేయడంతో దిక్కుతోచడం లేదని తెలంగాణ స్టూడెంట్స్​ఆందోళన చెందుతున్నారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్, ఇంటర్నెట్​సేవలు నిలిచిపోయాయని, తినేందుకు తిండి​ కూడా దొరకడం లేదని ఫోన్​ చేసి చెప్తుండడంతో ఇక్కడున్న వాళ్ల తల్లిదండ్రులు టెన్షన్​ పడుతున్నారు. కీవ్​కు దూరంగా ఉన్న ఏరియాల్లోని స్టూడెంట్స్​ మాత్రం తాము యూనివర్సిటీల్లో సేఫ్​గా ఉన్నామని, ఎలాంటి ఆందోళన వద్దని పేరెంట్స్​కు చెప్తున్నారు. 
 

కీవ్ ఎయిర్ పోర్టులో చిక్కుకున్న 20 మంది 
ఉక్రెయిన్​ లో పెట్రో మెహిలా బ్లాక్ సీ నేషనల్ యూనివర్సిటీ, బోగోమోలెట్స్ యూనివర్సిటీ , ఖార్కివ్ నేషనల్ మెడికల్ వర్సిటీ, కీవ్ మెడికల్ వర్సిటీ, నేషనల్ మెడికల్ వర్సిటీలతో పాటు పలు వర్సిటీల్లో తెలుగు స్టూడెంట్లు చదువుతున్నారు. యుద్ధం నేపథ్యంలో స్టూడెంట్లంతా హాస్టళ్లకే పరిమితమయ్యారు. పలు వర్సిటీల్లో పదిరోజులకు సరిపడా సరుకులు తెచ్చుకోవాలని స్టూడెంట్లకు అక్కడి స్టాఫ్​ సూచించారు. సైరెన్ వచ్చినప్పుడు లోపలికి పోవాలని ఆదేశాలిచ్చారు. రాజధాని కీవ్​పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో అక్కడ  వెయ్యి మంది దాకా ఉన్న తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్​పరిస్థితిపై ఆందోళన నెలకొంది. కాలేజీలన్నీ  మూతపడ్డాయని, తమను స్వదేశాలకు వెళ్లిపోవాలని మేనేజ్​మెంట్లు సూచించాయని స్టూడెంట్స్​ఇక్కడి తమ పేరెంట్స్​కు ఫోన్​ చేసి చెప్తున్నారు. చుట్టూ బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, తమ దగ్గర వారం రోజులకు  సరిపోయే  ఫుడ్డు  మాత్రమే ఉందని, ఏం చేయాలో, ఎటు  పోవాలో  తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇండియాకు వచ్చేందుకు కీవ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న  దాదాపు 20 మంది ఇండియన్​ స్టూడెంట్స్​ అక్కడే చిక్కుకుపోయారు. ఎయిర్​పోర్ట్​ నుంచి బయటకు వెళ్లే దారులన్నీ మూసేయడంతో ఇటు స్వదేశం రాలేక, అటు యూనివర్సిటీకి వెళ్లలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన కడారి సుమాంజలి, రమ్యశ్రీ, ఎన్.శ్రీనిధి, లిఖిత ఉన్నారు. వీళ్లందరూ స్థానిక జాఫ్రోజియా మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్​ చదువుతున్నారు. కరీంనగర్​కు చెందిన కడారి సుమాంజలి తన సోదరుడు కడారి స్వామికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సంజయ్​.. విదేశాంగ మంత్రి ఆఫీసుకు ఫోన్ చేసి, కీవ్​ ఎయిర్​పోర్ట్​లో చిక్కినవాళ్లందరినీ స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 

చుట్టూ బాంబులు  పేలుతున్నయ్​.. 
యుద్ధం వల్ల యూనివర్సిటీని  మూసివేసి హాస్టల్ ఖాళీ చేయించారు. నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి  ఓ అపార్ట్​మెంట్​లో ఉంటున్నాం. గురువారం ఉదయం  కీవ్  సిటీలో భారీ బాంబు పేలుళ్లు జరిగాయి. పెద్ద ఎత్తున శబ్దాలు  వినిపించాయి. 
- కీవ్​లో ఉంటున్న నిర్మల్​కు చెందిన సాయికృష్ణ 
 

తిండి లేదు.. నీళ్లు లేవు
వార్​తో ఉక్రెయిన్​లోనే ఇరుక్కుపోయినం. చాలా విమానాలు క్యాన్సెల్  అయినయి. ఇండియాకు ఎట్లా రావాలో అర్థం కావడం లేదు. తినడానికి ఫుడ్ లేదు.. తాగేందుకు వాటర్ కూడా లేదు. రాత్రుళ్లు బాంబుల సౌండ్స్​తో భయమైతున్నది. ఇక్కడ చాలామందిమి ఉన్నాం. పేరెంట్స్​తో పాటు మేం అందరం భయపడుతున్నం. దయచేసి మమ్మల్ని ఇండియాకు తీసుకుపోండి. 
‌‌‌‌- శ్రీజ, విశాఖపట్నం